సారంగాపూర్, ఆగస్టు 1 : “బీఆర్ఎస్ హయాంలో 90 శాతానికిపైగా పనులు పూర్తయిన రోళ్లవాగు ప్రాజెక్ట్‌కు గేట్లు ఎప్పుడు బిగిస్తరు. వర్షాలతో వరద నీరు వృథాగా పోతున్నా పట్టించుకోకపోతే ఎలా..? ఇందుకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి, జగిత్యాల ఎమ్మెల్యే బాధ్యత వహించాలి” అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, స్థానిక నాయకులతో కలిసి ప్రాజెక్టు మత్తడి వద్ద గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో జీవన్ రెడ్డి మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో రోళ్లవాగు ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 0.25 టీఎంసీ నుంచి ఒక టీఎంసీకి పెంచడంతోపాటు ఆధునీకరించేందుకు నిధులు మంజూరు చేయగా, 90శాతానికిపైగా పనులు పూర్తయినట్టు వివరించారు.
ప్రస్తుత ప్రభుత్వం గేట్లు బిగించకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయిందని, ఆ ప్రాంతంతోపాటు కొత్తగా గండి పడ్డ ఏరియా నుంచి నీరంతా వృథాగా పోతున్నదని చెప్పారు. ఇందుకు ప్రజాప్రతినిధులు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తోపాటు ముఖ్యంగా మంత్రి అడ్లూరి బాధ్యత వహించాలని హితవుపలికారు. సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్ మాట్లాడి సమస్యను వివరించారు. ఇప్పటికైనా స్పందించి రోళ్లవాగు ప్రాజెక్ట్‌కు గేట్లు అమర్చాలని, మంగెళ, కమ్మునూర్, కొల్వాయి, రేకులపల్లి, ఆరెపల్లి ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలిసి ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్కడే ఉన్న డీఈ రవికుమార్ జీవన్‌రెడ్డితో మాట్లాడుతూ ఈ నెల 15వరకు రోళ్లవాగు ప్రాజెక్ట్‌కు గేట్లు బిగించి సాగునీరందిస్తామని, అలాగే లిఫ్ట్‌ల మరమ్మతులు చేయిస్తామని పేర్కొన్నారు.
రోళ్లవాగు రైతులకు జీవధారగా నిలుస్తుందని, ప్రాజెక్టుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ప్రశ్నించారు. సారంగాపూర్, బీర్పూర్, ధ ర్మపురి మండలాలకు సాగు నీరందించడమే లక్ష్యంగా గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్‌ను ఆధునీకరించి 90 శాతానికిపైగా పనులు పూర్తి చేశారన్నారు. ఆనాడు జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న ఎం సంజయ్ కుమారే ఇప్పుడూ ఎమ్మెల్యేగానే ఉన్నారని, మరి రోళ్లవాగు ప్రాజెక్ట్‌కు గేట్లు ఎందుకు పెట్టించడం లేదని మండిపడ్డారు. ఇక్కడ యు వజన నాయకులు తాటిపర్తి సీకే రెడ్డి, సారంగాపూర్, బీర్పూర్ మండల పార్టీ అధ్యక్షులు నేరెళ్ల సుమన్ గౌడ్, తేలు రాజు, మాజీ జడ్పీటీసీలు కొల్ముల రమణ, ముక్క శంకర్, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ విండో చైర్మన్ సాగి సత్యంరావు, నాయకులు పాల్గొన్నారు.