హనుమకొండ చౌరస్తా : భారత్ ( India ) కు మనువాద మతోన్మాద శక్తులతోనే పెద్ద ప్రమాదముందని, దీన్ని కవులు కళాకారులు రచనలు, కళారూపాలతో తిప్పికొట్టాలని ప్రముఖ సంఘ సేవకులు సిహెచ్.రవీందర్ ( CH Ravinder ) పిలుపునిచ్చారు.
అభ్యుదయ రచయితల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 చారిత్రక సందర్భంగా హనుమకొండ లష్కర్బజార్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అరసం అధ్యక్షులు బూర భిక్షపతి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్మృతులను గుర్తుచేసుకోవాలన్నారు.
నిధి బ్రహ్మచారి మాట్లాడుతూ తెలంగాణ సాయిధపోరాట చరిత్రకు ముందున్న చారిత్రక క్రమాన్ని , పోరాటఘట్టాలను ఒక్కొక్కటిగా కళ్లకు కట్టినట్లు వివరించారు. అరసం ప్రధాన కార్యదర్శి డాక్టర్ మార్క శంకర్ నారాయణ మాట్లాడుతూ సెప్టెంబర్ 17కు ఒక చారిత్రక పోరాట నేపథ్యం ఉన్నదని, ఆ పోరాటం జనమే నడిపి జనమే నిర్మించిన పోరాటమన్నారు. విలీనమైన తర్వాత కూడా భారత సైన్యాలు 1951 వరకు హైదరాబాద్ సంస్థానంలోని ఉండి మూడు వేలమంది ప్రజలను, కమ్యూనిస్టులను పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు.
అరసం రాష్ట్ర అధ్యక్షులు పల్లేరు వీరాస్వామి , రామబ్రహ్మచారి, ప్రసూన, పిట్ట సాంబయ్య, గునిగంటి రమేష్, రాజేందర్, పి.రవీందర్, నిధి, భిక్షపతి, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మార్క శంకర్నారాయణ రచించిన ‘ ఆ పోరాట యోధులను ఎలా మరువగలం’ అనే వీడియో పాటను రవీందర్ ఆవిష్కరించారు.