Parliament : కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి ఒక ఆలోచనా విధానంగానీ, దూరదృష్టి గానీ, ఎలాంటి ప్రణాళిక గానీ లేవని మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభ (Rajya Sabha) లో ప్రధాని సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీరుపైనా మండిపడ్డారు. తాను ప్రసంగిస్తున్న సమయంలో ఖర్గే సహా విపక్ష నేతలు నినాదాలు చేయడంతో ప్రధాని మోదీ ఈ విధంగా స్పందించారు. ప్రధాని ప్రసంగాన్ని వ్యతిరేకించిన విపక్ష సభ్యులు.. దేశంలో నియంతృత్వం నడవదంటూ నినాదాలు చేశారు. సభ్యుల నిరసన మధ్యే ప్రధాని మోదీ తన ప్రసంగం కొనసాగించారు.
ఈ క్రమంలోనే విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు లోక్సభలో ప్రధాని మోదీని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్లాన్ చేసినట్లు తెలిసిందని స్పీకర్ ఓంబిర్లా పేర్కొన్నారు. విపక్షాల నిరసనల దృష్ట్యా ప్రధాని మోదీని సభకు రావొద్దని తానే సూచించానని ఆయన చెప్పారు. కాగా లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని సమాధానం ఇవ్వకపోవడం సిగ్గుచేటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.