హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డి అక్రమ కంపెనీ వ్యవహారాన్ని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ బట్టబయలు చేశారు. ఫ్లాట్ నంబర్ 1, శ్రీకృష్ణనగర్, కిష్టారెడ్డిపేట, పటాన్‌చెరులోని ఓ చిన్న ఇంట్లో ‘టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీని నిర్వహిస్తున్నాడని బహిర్గతం చేశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’ వేదికగా సదరు కంపెనీకి సంబంధించిన ఫొటోలను పోస్టు చేశారు. ఈ కంపెనీయే ‘ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎకోసిస్టమ్’ అని చెప్తున్నారని తెలిపారు. దీనికి అనుముల కొండల్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం రూ.లక్ష మూల ధనం ఉన్న కంపెనీ చైర్మన్‌తో యూఎస్ కాన్సుల్ జనరల్ వేదికను ఎలా పంచుకొన్నారని ప్రశ్నించారు. కొండల్‌రెడ్డి సదరు షెల్ కంపెనీ చైర్మన్ హోదాతోనే యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరమ్ (యూఎస్ఐఎస్పీఎఫ్)లో ఇండియా ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బోర్డులో మెంబర్‌గా చేరుతున్నారని, ఇదేలా సాధ్యమని ప్రశ్నించారు. క్రిశాంక్ చేసిన ఈ పోస్టును నెటిజన్లు పెద్ద ఎత్తున రీట్వీట్ చేస్తున్నారు.