మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబర్ 15 : ఆర్థిక కారణాలతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావొద్దనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘బోధనా రుసుముల చెల్లింపు పథకం’పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ పథకం కింద ప్రైవేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కోర్సుల ఫీజులను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ఇది రెండు రకాలు. మొదటిది ఎంటీఎఫ్-మెయింటెనెన్స్ ఆఫ్ ట్యూషన్ ఫీ (విద్యార్థుల మెస్‌చార్జీల కోసం విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తుంది). రెండోది ఆర్టీఎఫ్-రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ (కళాశాలల యాజమాన్యుల ఖాతా ల్లో జమ అవుతుంది). కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు విధానాల ఫీజు చెల్లింపులో తాత్సారం చేయడంతో పేద విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారుతున్నది.
విద్యార్థులను ఫీజులు అడగలేక.., ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు పొందలేక.., భవన అద్దె, జీతభత్యాలు, నిర్వహణ వ్యయం భరించలేక.., చేసి న అప్పులకు వడ్డీలు చెల్లించలేక.. చివరకు మూసి వేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించే స్థాయికి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు చేరుకున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని దసరా సెలవులకు ముం దే కోరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు కళాశాలల యాజమాన్య సంఘం పేర్కొన్నది. బంద్‌కు పిలుపునివ్వడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ నిర్ణయంతో విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడనున్నది. ప్రభుత్వంపై ఆధారపడి ప్రవేశాలు పొం దిన తమ పిల్లల చదువులు కొనసాగించలేక, ఫీజులు చెల్లించలేక, పై చదువులకు వెళ్లే అవకాశాన్ని కోల్పోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో 63 డిగ్రీ, పీజీ కళాశాలలు ఉన్నాయి. వీటిపరిధిలో సుమారు 50వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు సుమారు రూ.30కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు బోధన రుసుము బకాయిలు ఉన్నట్లు కళాశాలల యాజమాన్య సంఘం నాయకులు తెలిపారు. కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి విద్యాబోధన అందిస్తున్న డిగ్రీ, పీజీ కళాశాలలపై ఆర్థిక భారం పడుతున్నందున ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని విద్యార్థులు, ఆయా సంఘాల ప్రతినిధులు, తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగా, విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసేందుకు ఒత్తిడి చేస్తే.. ఆ కళాశాలలను బ్లాక్‌లిస్టులో చేర్చాలంటూ ఉన్నత విద్యామండలి అధికారులు ఆదేశిస్తుండడంతో యాజమాన్యులు కొట్టుమిట్టాడుతున్నారు.
పీయూ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలలు కచ్చితంగా అల్మనాక్ ప్రకారం ముందుకు సాగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దు. ఫీజ్ రీయింబర్స్మెంట్ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయంలో ఎవరూ తొందరపడొద్దు. తరగతులు, పరీక్షలు, ఇతరత్రా అన్ని రకాల కార్యక్రమాలు యథావిధిగా నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేశాం.
గద్వాల/అయిజ/నారాయణపేట రూరల్/మరికల్, అక్టోబర్ 15 : రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. డిగ్రీ కళాశాలలను మంగళవారం నుంచి బంద్ చేస్తున్నట్లు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలపై ఆధారపడి చాలా కాలేజీలు నడుస్తున్నాయని, కానీ, సర్కారు నిధులను విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. రీయింబర్స్మెంట్ విడుదలచేయకపోవడంతో అధ్యాపకులకు అధ్యాపకుల జీతాలు, భవనాల అద్దెలు, విద్యుత్ బిల్లులు, యూనివర్సిటీ రుసుములు చెల్లించలేకపోతున్నామని వాపోయా రు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేక కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు సహకరించాలని కోరారు. అలాగే డిగ్రీ కళాశాలల రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణగౌడ్ మాట్లాడుతూ గద్వాల జిల్లాలో 9 కళాశాలలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం సానుకూలంగా స్పందించి బకాయిలు విడుదల చేయాలన్నారు.
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సంఘం పిలుపుమేరకు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు యాజమాన్యాలు తాళాలు వేశాయి. నష్టాల భారంతో కంపెనీలు లాకౌట్ ప్రకటించినట్లుగా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఆర్థిక భారంతో కళాశాలలను మంగళవారం నుంచి మూసివేశాయి. పెండింగ్ రీయింబర్స్మెంట్ కోసం యాజమాన్యాలు ఏండ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తూ వచ్చాయి. కానీ, ఎలాంటి స్పం దన రాకపోవడంతో నిరవధిక బంద్ చేస్తున్నట్లు యాజమాన్యాలు స్పష్టం చేశాయి. హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలలను మినహాయిస్తే జిల్లాలు, పట్టణాల్లోని డిగ్రీ కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంటే ఆధారం. ఇది వస్తేనే యాజమాన్యాలు అధ్యాపకులు, పారిశుధ్య సిబ్బందికి వేతనాలు ఇ వ్వాల్సి ఉంటుంది. కొందరు యాజమాన్యంలోని డైరెక్టర్లు నిరుద్యోగులుగా ఉంటూ రీయింబర్స్మెంట్ ఆధారంగా జీవిస్తున్నారు. కాగా, బకాయిల భారం పేరుకుపోవడంతో యాజమాన్యాలు కళాశాలలను నిర్వహించలేకపోతున్నారు. ము ఖ్యంగా భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన కొన్ని కళాశాలల్లో బేదాభిప్రాయాలు వస్తున్నాయి. ఇక కళాశాలలు చాలా వరకు రెంటెడ్ భవనాల్లో నడుస్తుండగా.. అద్దెల భారం తీవ్ర ప్ర భావం చూపుతున్నది. దీంతో ప్రతినెలా కష్టంగా డిగ్రీ, పీజీ ప్రైవేట్ కళాశాలలు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే కళాశాలల మూసివేత విద్యార్థుల చదువులకు ప్రతిబంధకంగా మారనున్నది. విద్యా సంవత్సరం మధ్యలో ఇలా కళాశాలలు మూతపడితే ఇప్పటి వరకు చదివిన పాఠాలు మర్చిపోవడంతోపాటు తర్వాత తరగతులు ప్రారంభంలో జాప్యం జరిగినా విద్యా సంవత్సరం ముగిసేలోగా సిలబస్ పూ ర్తవ్వడం ప్రశ్నార్థకంగా మిగలనున్నదని వి ద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 8 డిగ్రీ కళాశాలలను మూసివేశారు. ఫలితంగా 5వేలకుపైగా విద్యార్థులపై ప్రభావం పడుతున్నది. రీయింబర్స్మెంట్ రాకపోవడంతో జిల్లాలో ఏడు కళాశాలలు మూతపడడం గమనార్హం.