మహబూబ్‌నగర్ అర్బన్, డిసెంబర్ 18 : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు కలిసి పనిచేశాయని, సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం హన్వాడ మండ లం బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారెంటీలు ఇస్తామని సాధ్యంకాని హామీలు ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే గ్రామాల్లో కరెంటులేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరలోనే ప్రభు త్వం పనితీరు ప్రజలకు పూర్తిగా తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు చేసే బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, ఏ సమస్య వచ్చినా వారికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో మనం పదేండ్లు అధికారంలో ఉన్నా ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని గుర్తు చేశారు. పార్టీ నాయకులు గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్టతకు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ పార్టీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ పథకాన్ని ప్రారంభించడంతో ఆటో డ్రైవర్లు దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడ్డారని, వారిని ప్రభు త్వం ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ బీఆర్ఎస్ కార్యాలమంలో ఆటో డ్రైవర్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అందరూ ఆహ్వానించవలసిందేనని, ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకునే చర్యలు చేపట్టలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.24 వేలతోపాటు, బ్యాంక్ ద్వారా రుణాలు పొంది ఆటోలు తీసుకు న్న వారి రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిం చే మార్గం చూపించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఆటోలను ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకోవాలని సూచించారు. ఆటో డ్రైవర్లకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎవరూ ఆందోళనకు గురికావద్దన్నారు. కొంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, మీరు మనోధైర్యం కోల్పోవద్దని మీ సమస్యల పరిష్కారానికి మీ వెంట మేముంటామని భరోసా ఇచ్చారు. తమ హయాంలో మహబూబ్‌నగర్ పట్టణంలో సిటీ బస్సులు ఏర్పా టు చేస్తే సిటీ బస్సుల వల్ల ఉపాధి కోల్పోవలసి వస్తుందని ఆటో డ్రైవర్లు తమతో ఆవేదన వ్యక్తం చేస్తే వెంటనే సిటీ బస్సులను గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగించామని గుర్తు చేశారు. ఓలో క్యాబ్ లాం టి సంస్థలను మహబూబ్‌నగర్‌లో అడుగుపెట్టనివ్వలేదని వారికి వివరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, హన్వాడ ఎంపీపీ బాలరాజు, వైస్ ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ విజయ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణకర్గౌడ్, నాయకులు లక్ష్మయ్య, బాలయ్య, వెంకటయ్య, కృష్ఱయ్యగౌడ్, నరేందర్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆలయంలో రామలింగేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా తెలంగాణ మాల మహానా డు ఆధ్వర్యంలో చలో బీమా కోరేగావ్ సం బంధించిన శౌర్యదివాస్ పోస్టర్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.