వనపర్తి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : నాణ్యమైన వేరుశనగ కు వనపర్తి జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నది. దేశ, విదేశాల్లో ఇక్కడ పం డించే పంటకు మంచి గుర్తింపు ఉన్న ది. దీనిని ద్విగుణీకృతం చేసి మార్కెట్ ను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయిపల్లి గ్రామంలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు జాతీయ పరిశోధన కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకుగానూ 25 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. త్వరలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో పరిశోధన కేంద్రానికి కూడా శంకుస్థాపన చేసేలా మంత్రి నిరంజన్‌రెడ్డి కృషి చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాణ్యమైన వేరుశనగ విత్తనాల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కదిరి, నల్లగొండ జిల్లాలోని డిండి పరిశోధన కేంద్రాలను ఉమ్మడి జిల్లా రైతులతోపాటు వివి ధ జిల్లాలు, రాష్ర్టాలకు చెందిన రైతులు ఆశ్రయిస్తున్నారు. కే-6 రకం వేరుశనగ క్వింటాకు రూ.12 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. రవాణా ఖ ర్చులు, సమయభావం వంటి అంశాలతో రైతుల కు ఇబ్బంది కలుగుతున్నది. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో ఏర్పాటు కానున్న పరిశోధన కేంద్రంతో ఉమ్మడి జిల్లా రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన వేరుశనగ విత్తనాలు లభించనున్నాయి.
ఫుల్ డిమాండ్..
ఉమ్మడి జిల్లాలో పండే వేరుశనగకు డిమాండ్ ఉన్నది. ఇక్కడి నేలల్లో ఆఫ్లటాక్సిన్ లేకపోవడంతో కొనుగోలుదారులు ఇక్కడి వైపే మొగ్గుచూపుతున్నారు. ఇక్కడి వేరుశనగ నుంచి అధికంగా నూనె రావడం, ఈ నూనెతో క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరకపోవడం కలిసివస్తున్నది. అందుకే ముంబై, పూణె, గుజరాత్ వంటి ప్రాంత ట్రేడర్లు ఇక్కడికి వచ్చి రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. వీటిని అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతూ ఎగుమతి చేస్తున్నారు. దేశంలో ఎ క్కడా లేని విధంగా వనపర్తి మార్కెట్ యార్డులో క్వింటా వేరుశనగ గరిష్ఠంగా రూ.9 వేలు పలుకుతున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో యాసంగిలో ఏ టా లక్ష ఎకరాలకు పైగా వేరుశనగ సాగవుతున్నట్లు అధికారుల అంచనా. వనపర్తి జిల్లా పరిధిలోనే సు మారు 60 వేల ఎకరాలు సాగవుతున్నది. వేరుశనగ సాగు కోసం ఉమ్మడి జిలా వ్యాప్తంగా సగటున 45 వేల క్వింటాళ్ల విత్తనాలు ఉపయోగిస్తున్నారు. బ్రాండ్ వనపర్తి పేరుతో వంటనూనె, పల్లీపట్టిలు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
పరిశోధన కేంద్రంతో ప్రయోజనాలు..
పరిశోధన కేంద్రం ఏర్పాటుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గ్రేడింగ్ చేసిన వేరుశనగను నా లుగు భాగాలుగా విభజించి మొదటి రకాన్ని విత్తనాలకు, ఇతర రకాలను వేరుశనగ ఉప ఉత్పత్తుల (వంటనూనె, చిక్కీలు, ఆహార పదార్ధాలు) తయారీకి వినియోగించనున్నారు. పరిశోధన కేంద్రం రా వడంతో యువతకు ఉపాధి అవకాశాలు, రైతుల అధిక ధర లభించనున్నది.
యూరోపియన్ దేశాలకు ఎగుమతి..
ఇక్కడ పండే వేరుశనగలో ఆఫ్లటాక్సిన్ అనే శిలీంధ్రం ఉండకపోవడంతో అధిక డిమాండ్ ఉన్నది. నేల స్వభావం వల్ల దిగుబడిలో నాణ్యత ఉంటుంది. అందుకే యూరోపియన్ దేశాలతోపాటు అమెరికాకు ఎగుమతి అవుతున్నది. వేరుశనగ పంటలో చివరి రకమైన తాలును కూడా ట్రేడర్స్ కొనుగోలు చేస్తున్నారు. ఆరోగ్యానికి మంచిదని తేలడంతో దేశంలోని వివిధ ప్రాంతాల వర్తకులు ఆసక్తి కనబరుస్తున్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి కృషితో పరిశోధన కేంద్రం రావడంతోపాటు దీనికి అనుగుణంగా 42 ఎకరాల్లో చిట్యాలలో మార్కెట్ యార్డు నిర్మాణం జరుగుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి కృతజ్ఞతలు.
తాలు కొనుగోలుకూ పోటీ..
ఉత్తర భారతదేశానికి సంబంధించిన ముఖ్య పట్టణాలకు మన వేరుశనగ ఎక్కువగా ఎగుమతి అవుతున్నది. అక్కడి ట్రేడర్లు విమాన, సముద్ర మార్గాల ద్వారా అమెరికాతోపాటు యూరప్దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. స్థానిక ట్రేడర్ల నుంచి కొనుగోలు చేసి వాటిని ప్రాసెసింగ్ చేసి బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు పంపిస్తున్నారు. వనపర్తిలో ప్రాసెసింగ్ యూనిట్లు నడుస్తున్నాయి. గ్రేడింగ్ చేసిన తరువాత అతి తక్కువ నాణ్యత గల తాలు రకం విత్తనాలను కొనుగోలు చేయడానికి కూడా జాతీయస్థాయి ట్రేడర్లు పోటీపడుతున్నారు.