జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల పైకి ఓ బొలెరో వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన జిల్లాలో కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాలేజీ ముగించుకొని గద్వాల -ఎర్రవల్లి రహదారిపై జిల్లా కేంద్రంలోని మహేంద్ర షోరూం ఎదుట మనిషా శ్రీ, మానస, ప్రణతి నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో ఎర్రవల్లి నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టడంతో మనిషా శ్రీ, మానస అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రణతి అనే విద్యార్థినికి తీవ్ర గాయాలు కాగా గద్వాల జనరల్ హాస్పిటల్కు తరలించారు. అలాగే అక్కడే పానిపూరి బండిని ఢీకొట్టడంతో అక్కడ నిలుచున్న ఓ బాలుడు పై ఆయిల్ పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, మనిషా శ్రీది వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రాయిపల్లి, మహేశ్వరిది మక్తల్ తాలూకా లింగంపల్లి గ్రామం, గాయపడిన ప్రణతిది భువనగిరిగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి . కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు సందర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.