హబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 19 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్‌ల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30గంటల వరకు జరుగుతాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ-గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓపెన్ టెన్త్‌కు 19 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 3,389మంది పరీక్షలు రాయనున్నారు. ఇంటర్‌కు 29కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,782 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రాక్టికల్స్‌కు 5 కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,402 మంది హాజరుకానున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 28 నుంచి మే 5వ తేదీ వరకు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
జిల్లాల వారీగా అభ్యర్థులు, కేంద్రాలు, ఏర్పాట్లు ఇలా.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఓపెన్ టెన్త్ పరీక్షలు 1100మంది అభ్యర్థులు రాయనుండగా 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలు 1,665 విద్యార్థులు రాయనుండగా 9కేంద్రాలు ఏర్పాటు చేశారు. జోగుళాంబ-గద్వాల జిల్లాలో టెన్త్‌కు 3, ఇంటర్‌కు 4 కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 1,424 మంది పరీక్షలు రాయనున్నారు. వనపర్తి జిల్లాలో టెన్త్‌కు 2, ఇంటర్‌కు 3 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1,239 మంది పరీక్షలు రాయనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో టెన్త్‌కు 4, ఇంటర్‌కు 7కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,589 మంది పరీక్షలు రాయనున్నారు.
నారాయణపేట జిల్లాలో టెన్త్‌కు 4 కేంద్రాలు, ఇంటర్‌కు 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,154 మంది పరీక్షలు రాయనున్నారు. పదో తరగతి పరీక్షలకు 187మంది ఇన్విజిలేటర్లు, ఇంటర్ పరీక్షలకు 318మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక సిట్టింగ్ స్కాడ్‌తో పాటు జిల్లాకు రెండు ఫ్లయింగ్ స్కాడ్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎవరైనా విద్యార్థులు హాల్ టికెట్లు పొందకపోతే వెంటనే నిర్దేశిత వెబ్సైట్ (తెలంగాణ ఓపెన్ స్కూల్.ఓఆర్జీ) నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్షా కేంద్రాల్లోకి ఎవరికీ ఫోన్ అనుమతి లేదు. నిర్దేశిత సమయానికంటే గంట ముందుగానే అభ్యరులు కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత అనుమతి ఉండదు.