గద్వాల : జిల్లాలో కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రానికి చెందిన తేజేశ్వర్ హత్య బాధాకరమన్నారు. గంగనపల్లిలో ఇదే తరహాలో మహిళ హత్య చేయబడిందన్నారు. ఇలాంటి కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్కోర్టులే పరిష్కారం అన్నారు ఇటువంటి నేరాలకు పాల్పడిన నిందితులను ఆరు నెలల్లోపు శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల నిందితులకు శిక్ష పడినపుడు బాధితులకు న్యాయం జరిగినట్లు అవుతుందన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసే విధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడమే మంచిదన్నారు. దీని ద్వారా తప్పు చేసిన వారికి త్వరగా శిక్షలు పడే అవకాశం ఉందన్నారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. కేసును త్వరితగతిన చేదించిన పోలీసులను ఎమ్మెల్యే అభినందించారు. అంతకుముందు ఎమ్మెల్యే తేజేశ్వర్ తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సమావేశంలో నాయకులు బండారు భాస్కర్. గడ్డం కృష్ణారెడ్డి, మురళి, బాబర్, సుదర్శన్ రెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.