నాగర్కర్నూల్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని చెరువులన్నింటికీ జియో ట్యాగింగ్ చేసేందుకు అధికారు లు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యకారుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. అయితే, చేప పిల్లలను వదలడం, పెంపకంలో అక్కడక్కడా అనుమానాలు వస్తున్నాయి. వివాదాలకూ దారి తీస్తున్నది. ఈ క్రమంలో చేపల పెంపకాన్ని పారదర్శకంగా నిర్వహించేలా సాంకేతిక పద్ధతిని వినియోగించాలని నిర్ణయించింది. చేప పిల్లలు విడుదల చేసే చెరువులను జి యో ట్యాగింగ్ చేయనున్నారు. రిమోట్ సెన్సింగ్ సహకారం తో ఈ పద్ధతి అమలు కానున్నది. ఇందులో భాగంగా ప్రభు త్వం మత్స్యశాఖ ద్వారా చెరువుల వివరాలు సేకరించింది. ఇ ప్పటి వరకు చెరువుల్లో మత్స్యశాఖ ద్వారా పెంచుతున్న చెరువుల విస్తీర్ణం, చేప పిల్లలు వదిలేందుకు ఎన్ని చెరువులు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని నెలలు నీటి వనరులు నిల్వ ఉంటా యి.. అనే వివరాలు ఈ విధానంతో స్పష్టంగా తెలియనున్నది. ముఖ్యంగా ఏ చెరువుల్లో ఎక్కువ రోజులు నీళ్లు నిల్వ ఉంటాయోననే వివరాలనూ మత్స్యశాఖ అధికారులు సేకరించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. సమాచారాన్ని బట్టి ఈ సీజన్లోనే దాదాపుగా జియో ట్యాగింగ్ పద్ధతిని అమలు చేయనున్నది. దీంతో రానున్న కాలంలో చెరువుల్లో చేప పిల్లల పెం పకంలో పూర్తి పారదర్శకత ఏర్పడుతుంది.
ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఇస్తున్న చేప పిల్లలు దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలూ ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఊరూరా మత్స్యకారులు చేప పిల్లలను పెంచుతూ అమ్ముకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. దీనివల్ల గ్రామాల్లోని చిన్న చెరువుల్లోనూ కిలోల బరువున్న చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ పద్ధతి అమలైతే ఆయా చెరువుల్లో చేప పిల్లల విడుదల, పెంపకంలో అక్రమాలకు తావుండదు. నీళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండే, విస్తీర్ణం అధికంగా ఉండే చెరువుల్లో, చిన్నచిన్న చెరువులు, కుంటల్లో వేసే చేప పిల్లల పెంపకంలో తప్పులు జరగకుండా వాస్తవ పద్ధతిలో పథకం అమలు జరుగుతుంది. ఒక చెరువులో చేప పిల్లలు వేస్తే దాదాపు 7 నుంచి 8 నెలలు నీరు నిల్వ ఉంటేనే ఉపయోగం ఉంటుంది. ఈ కారణంగా చెరువులకు జియో ట్యాగింగ్ పద్ధతి అమలైతే చేప పిల్లల పెంపకంలో పారదర్శకత చోటు చేసుకోనున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో 1,470 వరకు చెరువుల వివరాలను జిల్లా మత్స్యశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఈ ఏడాది దాదాపుగా 2.95 కోట్ల చేప పిల్లలను విడుదల చేసేందుకు మత్స్యశాఖ అధికారులు ప్రణాళిక తయారు చేశారు.
ప్రభుత్వానికి నివేదించాం..
చెరువుల జియో ట్యా గింగ్ పద్ధతిని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని 1470కి పైగా చెరువుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ఈ వివరాల ఆధారంగా త్వరలో జియో ట్యాగింగ్ పద్ధతి అమలవుతుంది. జిల్లాలో 2017-18లో 1.27 కోట్ల చేపలు, 2019లో 15.8 కోట్లు, 2020లో 2.15 కోట్లు, 2020-21లో 2.41 కోట్ల చేప పిల్లలను విడుదల చేశాం. ఈ ఏడాది 1,473 చెరువుల్లో 2.99 కోట్ల చేప పిల్లలు విడుదల చేసేందుకు కార్యాచరణ తయారు చేశాం. జియో ట్యాగింగ్ పద్ధతి అమలైతే చేపల పెంపకంలో మరింత పారదర్శకత ఏర్పడుతుంది.