జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 3 : సేవాదృక్పథం కలిగిన మంచి నేత ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. ఓ వైపు ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి, మరోవైపు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని అన్నారు. జిల్లాలో మచ్చలేని నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారని అభినందించారు. గురువారం ఎమ్మె ల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా జడ్చర్లలో నిర్వహించిన కార్యక్రమాలకు మంత్రి హాజరయ్యారు. పలు చోట్ల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి మంత్రి సమక్షంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కేక్ కటింగ్ చేశారు. ఎమ్మెల్యేకు మంత్రితోపాటు పార్టీనేతలు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్ యార్డులో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధే తన ధ్యేయమని.. ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అభివృద్ధిలో అందరం కలిసికట్టుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూరు మున్సిపాలిటీలను కలుపుతూ మహానగరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అన్నదమ్ముల్లా కలిసి మెలసి జిల్లాను బాగు చేసుకుందామని కోరారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే పరిష్క రించేందుకు కృషి చేస్తానన్నారు.
రక్తదాతలకు ధన్యవాదాలు : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
తన జన్మదినం సందర్భంగా బాదేపల్లిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన దాతలకు ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తన బర్త్‌డేను పురస్కరించుకొని సామాజిక సేవా, హరితహారం కార్యక్రమాలను చేపట్టారని చెప్పారు. 18 ఏండ్లుగా నిర్వహిస్తున్న శిబిరంలో రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు కాపాడుతున్న అభిమానులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిదని ఆయనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండడంతో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపు సులభమే అని ధీమా వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతోపాటు ప్రతి పేదోడీకి డబుల్బెడ్రూం ఇండ్లు అందించనున్నట్లు ఆయన తెలిపారు. అంతకు ముందు కావేరమ్మపేట, జడ్చర్ల, బాదేపల్లి పట్టణాల్లో జరిగిన కేక్ కటింగ్‌లకు హాజరైన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. జడ్చర్ల ఫ్లై ఓవర్ వద్ద ఎమ్మెల్యేకు గజమాల వేసి పార్టీశ్రేణులు అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, తెలంగాణ సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.