న్యూఢిల్లీ: భారత్-అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని ఆత్మనిర్భర్(స్వావలంబన) చేస్తామని ప్రగల్భాలు పలికిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ట్రంప్ పే నిర్భర్‌గా(ట్రంప్‌పై ఆలంబన) మార్చివేసినట్లు కనిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. శనివారం న్యూఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ భారతదేశ విదేశాంగ, ఆర్థిక విధానాలపై అమెరికాతో రాజీపడేందుకు కేంద్రం అంగీకరించిందని, ఇటువంటి పరిస్థితి దేశ చరిత్రలో ఎన్నడూ సంభవించలేదని చెప్పారు. ప్రధాని కొత్త కార్యాలయం సేవా తీర్థ్ ప్రారంభోత్సవాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ఈ దేశం పట్ల తన కర్తవ్యాన్ని పూర్తి చేశారా అని సిబల్ ప్రశ్నించారు. భవనాలు కట్టడం మంచిదేనని, సత్యమేవ జయతే అన్న మాటలు కూడా వింటున్నామని, కాని 11 ఏండ్లుగా అసత్యమే గెలుస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు.