హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ బీజేపీకి అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తాజాగా సోమవారం ప్రకటించిన కమిటీలో తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటుదక్కలేదు. అసలే కొన్నేండ్లుగా రాష్ట్రంలో బీజేపీ పనితీరు అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో, దూకుడుగా ప్రతిపక్ష పాత్రను పోషించాల్సింది పోయి.. అధికార కాంగ్రెస్‌తో అంటకాగడం ఢిల్లీ అధిష్ఠానానికి కోపం తెప్పించినట్టున్నది. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రం నుంచి జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌కు ఈసారి చోటు దక్కకపోగా, వారి పదవులు కూడా రెన్యువల్ కాలేదు. కాంగ్రెస్‌తో మిలాఖత్ కావడం, కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ విధానాలను బహిరంగంగా మెచ్చుకోవ డం, స్థానిక ముఖ్యమంత్రికి కితాబులివ్వడం, బీజేపీ జాతీయ నాయకత్వానికి ఏమాత్రం నచ్చలేదు. కాంగ్రెస్‌తో అంటకాగడమే వారి కొంపముంచినట్టు తెలుస్తుండగా, అధిష్ఠానం పెద్దల నిర్ణయంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది.
దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఎంతో కొంత ప్రాధాన్యం కల్పించి జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. కానీ, అనేక సంవత్సరాలుగా తెలంగాణకు ఉన్న పోస్టులను కూడా రెన్యువల్ చేయలేదు. సహజంగా తెలంగాణ అంటే బీజేపీ అధిష్ఠానానికి గతంలో మంచి అభిప్రాయమే ఉండేది. ఇక్కడి గతంలో జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షులుగా కూడా పనిచేసిన వారున్నారు. ప్రతిసారీ జాతీయ కమిటీలో మంచి పదవులనే ఇచ్చేవారు. అలాంటిది సోమవారం ప్రకటించిన కమిటీలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రం నుంచి ఒక్కరికీ అవకాశమివ్వలేదు. తెలంగాణకు చోటు కల్పించని బీజేపీ హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి, పార్టీ జాయింట్ కో ఆర్డినేటర్‌గా విష్ణువర్ధన్‌రెడ్డిలు ఇద్దరికీ బెర్త్ ఓకే చేసింది. అంతే కాదు.. ఒకే ఒక్క ఎంపీ సీటు గెలిచిన కేరళ నుంచి ఇద్దరిని జాతీయ కార్యదర్శులుగా అధిష్ఠానం నియమించింది. కానీ 8మంది ఎంపీలున్న తెలంగాణను విస్మరించడం గమనార్హం. 70మంది సభ్యులతో విడుదల చేసిన కొత్త జాబితాలో 13మంది జాతీయ ఉపాధ్యక్షులు, 9మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 16 మందిని జాతీయ కార్యదర్శులుగా నియమించింది.
గతంలో మాదిరిగా రాష్ట్ర బీజేపీపై అధిష్ఠానానికి సదభిప్రాయం లేకపోవడమే తాజా పరిణామాలకు కారణమని తెలుస్తున్నది. తెలంగాణ నేతలపై విశ్వాసం సన్నగిల్లడం వల్లే వారిని పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయడం లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో అంటకాగడం, కుమ్మక్కు కావడంపై అనేక సందర్భాల్లో హైకమాండ్ హెచ్చరించినా వారు పెడచెవిన పెట్టారు. ఫలితంగా క్రమంగా టీ బీజేపీ నేతలను దూరంపెట్టడం మొదలుపెట్టింది. అందుకే ఒక్కరికి కూడా తాజా కమిటీలో చోటివ్వలేదని స్పష్టమవుతున్నది.
పశ్చిమబెంగాల్ తర్వాత ఇక బీజేపీ దృష్టి తెలంగాణపైనే అంటూ కొందరు బీజేపీ స్థానిక నేతలు యూట్యూబ్ చానళ్లలో ఊదరగొట్టించారు. అయితే, ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నం గా ఉన్నట్టు పార్టీ అధిష్ఠానం గుర్తించింది. కాంగ్రెస్ నేతలతో కలిసి రాష్ట్ర నాయకత్వం సె టిల్మెంట్లు, పైరవీలు చేసుకుంటుండటం, ఇది బహిరంగ వేదికల్లోనే స్పష్టంగా కనిపిస్తుండటంతో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడం కష్టమన్న నిర్ధారణకు హైకమాండ్ వచ్చినట్టు చెప్తున్నారు.
ఇటీవల ఓ ఎంపీ ఢిల్లీలో పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వద్దకు వెళ్లినపుడు ఆయన తెలంగాణ ఎంపీకి కనీసం సమయం ఇచ్చేందుకు గానీ, మాట్లాడేందుకు గానీ సిద్ధంగా లే నని తేల్చిచెప్పినట్టు బీజేపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతున్నది. ఆ ఎంపీని ఉద్దేశించి గెట్ అవుట్ అని, చీటికిమాటికీ తన వద్దకు రావద్దని, మీ రాష్ట్ర ఇన్చార్జితో చెప్పుకోవాలని, రాష్ట్రంలో పార్టీ ఇలా కావడానికి మీరంతా కారణమని సీరియస్ అయినట్టు తెలిసింది.
జాతీయ కమిటీలో ఎవరికీ చోటుదక్కని నేపథ్యంలో మున్ముందు రాష్ట్రం నుంచి ఉన్న రెండు మంత్రి పదవులను కూడా ఉంచుతా రా? తీసేస్తారా? అనే చర్చ పార్టీలో మొదలైం ది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు పోక్సో కేసులో నిందితుడిగా ఉండటం, కేంద్ర మంత్రి హోదాను మరచి బండి సంజయ్ కొడుకును కాపాడేందుకు ప్రయత్నించడంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో బీజేపీకి బండి సంజయ్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే కేంద్ర క్యాబినెట్ విస్తరణలో సంజయ్ మంత్రి పదవిని తొలగిస్తారని చెప్తున్నారు. ఇదే వరుసలో కిషన్‌రెడ్డి పదవి కూడా ఉంటుందో? ఊడుతుందో? చెప్పలేమని బీజేపీ వర్గాలు అంటున్నాయి.