చుంచుపల్లి, సెప్టెంబర్ 09 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి.రోహిత్ రాజు చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌తో పాటు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాత్రివేళల్లో పోలీసుల పనితీరు, నిఘా వ్యవస్థను పరిశీలించారు. ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండేలా పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌లో సీసీ కెమెరాల ద్వారా కొనసాగుతున్న పర్యవేక్షణను పరిశీలించిన ఎస్పీ అనుమానాస్పద కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించి, వెంటనే స్పందించాలని సూచించారు. ఆలర్టింగ్, రౌండింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ రాత్రివేళల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.