న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు తప్పేటట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం సంవత్సరం చివరినాటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93 స్థాయికి పడిపోవచ్చునని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనావేస్తున్నది. ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్ల నిర్ణయం ఆధారంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉన్నదని, దీంతో రూపాయికి బెడద తప్పదని రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది.
రష్యాయేతర ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నట్టు భారత్ ప్రకటించడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం కూడా రూపాయి స్థాయిని మరింత దిగజారుస్తుందని పేర్కొంది. గడిచిన సంవత్సరంలో రూపాయి విలువ 5 శాతం పతనం చెంది 92 స్థాయిలో కదలాడుతున్నది.