Fire Accident | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని చిన్న అగ్రహారం సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెయింటింగ్ షాపులో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.35లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం తెల్లవారుజామున షాపు దగ్గర మంటలు ఎగిసిపడటంతో ఇది గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే షాపులోని పెయింట్ డబ్బాలు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.
అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.