Jogulamba Gadwal | గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో అనుమానాస్పదంగా మృతదేహం లభ్యమైంది. అనంతపురం గ్రామం నుంచి పూడూర్ వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెంది కనిపించాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతుడిని ఎర్రవెల్లి మండలం దువ్వాసిపల్లి గ్రామానికి చెందిన వడ్డె పర్శ(34)గా పోలీసులు గుర్తించారు. మృతదేహం లభ్యమైన చోట ఎలాంటి పెనుగులాట లేకపోవడం, పక్కనే మద్యం బాటిల్ ఉండటంతో ఎక్కడో చంపి.. ఇక్కడ పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. అతని భార్య ఏడాది క్రితం వదిలి వెళ్లినట్లు పేర్కొన్నారు.