జోగులాంబ గద్వాల : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం గట్టు మండలంలోని తప్పెట్ల మోరుసు, గొర్లఖాన్ దొడ్డి , ఆరగిద్ద, పెంచికలపాడు, రాయపురం, గట్టు గ్రామాల పాఠశాలలను తనిఖి చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లోని పరిసరాలను పరిశీలించారు. బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి వంటశాలను శుభ్రంగా ఉంచాలని వర్కర్లను ఆదేశించారు. భోజనం బాగుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో ఎలాంటి చెత్తా చెదారం ఉండకుండా పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
విద్యార్థుల హాజరు శాతాన్ని, మధ్యాహ్న భోజనంకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రతలు తీసుకోవాలన్నారు.
మన ఊరు -మన బడి పథకం ద్వారా చేపట్టిన పనులను తనిఖీ చేశారు.
అనంతరం ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేసిన కలెక్టర్ హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. దవాఖానకు వచ్చే రోగులకు డాక్టర్స్ అందరు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.