జోగులాంబ గద్వాల : జిల్లా ప్రభుత్వ దవాఖానకి సంబంధించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్య శాఖ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానల అభివృద్ధి పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లా దవాఖానలో రోగులకు అన్ని మౌలిక సదుపాయాలు, అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉండే విధంగా జిల్లా దవాఖానను అభివృద్ధి చేయాలన్నారు. హాస్పిటల్‌కు సంబంధించిన ప్రహరీ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, దవాఖానలో జనరేటర్, మెడికల్ వార్డ్‌లో ఎల్.ఈ.డి లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఐ.సి.యు కి సంబంధించిన పనులు పెండింగ్ ఉంటే పూర్తి చేయాలన్నారు. అయిజ , ఆలంపూర్ హాస్పిటల్స్‌కు సంబంధించిన స్లాబ్, ఇతర నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో నిర్మితమవుతున్న ప్రభుత్వ హాస్పిటల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలంపూర్ దవాఖానకి ఒక అంబులన్స్, గైనకాలజిస్ట్ తప్పనిసరిగా అవసరమున్నందున వాటి కోసం ప్రతిపాదనలు పంపించాలని అన్నారు.
రోగులను జాగ్రత్త గా చూసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ దవాఖానలలో ప్రతి ఒక్క వార్డుకు నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలనీ, దవాఖాన సంబంధించిన అన్ని అంశాల పై రివ్యూ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా ప్రభుత్వ దవాఖానలను విజిట్ చేస్తారని, అప్పటివరకు దవాఖానలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి, పనులు ఏవీ పెండింగ్ ఉంచకుండా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, డాక్టర్ కిషోర్ కుమార్, డాక్టర్ శశికళ, శోభ రాణి, టి.ఎస్.ఎం.ఎస్.ఐ.డి.సి జయపాల్ రెడ్డి, డి.ఈ. రాఘవన్, ఆర్.ఎం.ఓ రుశాలి, సుబేద, తదితరులు పాల్గొన్నారు.