గద్వాల అర్బన్: గద్వాల (Gadwal) జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీసు అధికారిపై ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తున్నది. ఆ అధికారి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని అవినీతి ఆరోపణలు రావడంతో పోలీస్ శాఖతోపాటు ఇటు ఏసీబీ అధికారులు కూడా సదరు దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటికే ఆ మండలంలో కొంతమంది వ్యక్తులతో ఆ పోలీసు అధికారికి సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. లంచం అడిగినట్లు సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆ మండల ప్రజలకు ఏసీబీ అధికారులు సూచించినట్లు తెలుస్తున్నది.
అయితే సదరు ఆఫీసర్ అవినీతి ఆరోపణ వ్యవహారంపై ఇప్పటికే పోలీసు ఉనతాధికారులు రహస్య విచారణ నిర్వహించిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆ అధికారి వీధుల్లో చేరినప్పటి నుంచి నేటి వరకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీస్ ప్రత్యేక బృందం సభ్యుల విచారణ తెలింది. ఈ వ్యవహారమే కాక ఓ మహిళ తన భర్త మీద కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్కు వస్తే బాధిత మహిళలకు అండగా ఉండాల్సిన అధికారే.. తన నిజ స్వరూపం చూపించి రక్షక భటుడిని.. కాదు రాక్షస భట్టుని అన్న విధంగా బాధిత మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడినట్లు తెలిసింది. బాధిత మహిళ ఆ పోలీస్ అధికారి వ్యవహరించిన తీరుపై కోర్టుని ఆశ్రయించినట్లు తెలిసింది.
అలాగే విధుల్లో చేరిన మొదట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులను రిమాండ్ చేయాల్సి ఉండగా.. వారిని రిమాండ్ కాకుండా స్టేషన్ బెయిల్ మీద విడుదల చేయడంలో లక్షల రూపాయలు మామూలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే మట్టి, ఇసుక, బియ్యం తదితర వ్యవహారాల్లో ఇద్దరు పోలీస్ సిబ్బందిని నియమించుకొని అక్రమ లావాదేవీలు నడిపినట్లు రహస్య విచారణలో తేలినట్లు సమాచారం. అలాగే సదరు అధికారిపై ఏసీబీ ఆరా తీస్తున్న విషయం తెలుసుకున్న పోలీసు యంత్రాంగం ఆయనపై చర్యలు తీసుకున్నందుకు రంగం సిద్ధం చేసింది. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడితే జిల్లా పోలీస్ శాఖకు చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో సదరు పోలీస్ అధికారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకున్నందుకు సిద్ధమైనట్టు పోలీస్ వర్గాలలో చర్చ మొదలైంది.