గద్వాల: జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా ఎర్రవల్లి మండలంలోని ధర్మవరం బీసీ వసతిగృహంలో (BC Hostel) ఆహారం కలుషితమైంది (Food Poison). దీంతో 53 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతిగృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా… శుక్రవారం 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనాలయ్యాక 9 గంటల తర్వాత 86 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వసతిగృహం సిబ్బంది, పోలీసులు వారిని అంబులెన్స్‌లో గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులు కోలుకున్నారని, ప్రస్తుతం దవాఖానలో 53 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వారి పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.

బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా 53 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నియంత్రణలో ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.