గద్వాల, జూలై 22 : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ అంతా గందరగోళంగా మారింది. జాబితాలో పేరున్నా కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు. రుణమాఫీ అయిందా లేదా అని తెలుసుకుందామని రైతులు బ్యాంకులకు వెళితే బ్యాంకులన్నీ రైతులతో కిటకిట లాడుతున్నాయి. రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టడానికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రుణమాఫీ అంటూ రైతు భరోసా గురించి ఆలోచించకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. రైతు భరోసా కింద వానకాలం సాగుకు పాతపద్ధతిలో ఇస్తే సుమారు రూ.232 కోట్లు జిల్లాకు అవసరమవుతాయని, కానీ రుణమాఫీ ద్వారా లక్షలోపు రుణాలు తీసుకున్న వారికి రూ.144కోట్లు రుణమాఫీ అవుతుండడంతో ప్రభుత్వం మొదట రుణమాఫీ చేసినట్లు తెలిసింది.
రుణమాఫీ కంటే ముందు రైతు భరోసా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రుణమాఫీ చేసిన తర్వాత దానిని రెన్యువల్ చేసుకోవడానికి రైతులు వెళితే వడ్డీ కట్టండి ఆ తర్వాత రెన్యువల్ చేస్తామని బ్యాంకర్లు చెబుతుండడంతో రైతులకు ఏమి చేయాలో తోచడం లేదు. బ్యాంకు అధికారులు వడ్డీ కట్టాలని చెప్పడంతో రుణమాఫీ ఆనందం రైతుల్లో లేకుండా పోతున్నది. రుణమాఫీ వివరాలు తెలుసుకోవడానికి రైతులు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. ఏ ప్రామాణికంగా రైతులకు రుణమాఫీ చేశాడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు రుణమాఫీ ప్రకటనతో రేవంత్ సర్కార్ రైతులను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. ఎటువంటి షరతులు లేకుండా అర్హత కలిగిన ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రుణమాఫీ కాలేదంటూ రైతుల ఆందోళన..
కొంతమంది రైతులకు అర్హత ఉన్నా రూ.లక్షలోపు రుణా లు మాఫీ కాలేదు. ఇదేమని వ్యవసాయశాఖ, బ్యాంకర్లను అడిగితే మాకు తెలియదని సమాధానం చెప్పడంతో రైతులకు ఏమి చేయాలో పాలు పోవడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లాలో రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు సుమా రు 1.40లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు. అయితే మొదటి విడుత జిల్లాలో 24,398 మంది రైతులకు రుణమాఫీ రూ.144 కోట్లు అయ్యిందని చెబుతున్నారు. ప్ర భుత్వం ప్రకటించిన జాబితాలో పేర్లు ఉన్న వారందరికీ రుణమాఫీ అయిందని అధికారులు రైతులకు చెబుతుండగా వా స్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. తాము రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్నా తమకు రుణమాఫీ కాలేదని రైతు లు లబోదిబోమంటున్నారు.
కేసీఆర్ సర్కారే బాగుండే..
యూనియన్ బ్యాంక్‌లో రూ.40వేలు రుణం తీసుకున్నాను. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో నా పేరు లేదు. రెగ్యులర్‌గా వడ్డీ చెలిస్తున్నా రుణమాఫీ కాలేదు. వడ్డీ చెల్లించని వారికి ప్రభు త్వం రుణమాఫీ చేసింది. గ త కేసీఆర్ ప్రభుత్వమే మే లు. ఓ క్లారిటీగా రుణ మా ఫీ చేసింది. రైతు భరోసా ఇ వ్వలేక ప్రభుత్వం రుణమాఫీ చేసి రైతులను బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేస్తున్నారు. రుణ మాఫీ పై ప్రభుత్వం రైతులకు స్పష్టత ఇవ్వాలి.
– వెంకటన్న, రైతు, లత్తీపురం, జోగుళాంబ గద్వాల జిల్లా
రూ.లక్షలోపు ఉన్నా మాఫీ కాలే..
యూనియన్ బ్యాంక్‌లో రుణం తీసుకున్నాను. రూ.లక్షలోపు రుణం ఉన్నా మాఫీ కాలేదు. అధికారులను అడిగితే మాకు తెల్వదని సమాధానం చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్ష వరకు రుణమాఫీ చేశామని చెబుతూ సంబురాలు చేస్తున్నది. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. రుణమాఫీ కాక, రైతు భరోసా ఇవ్వక ఇబ్బందులు పడుతున్నా. ప్రభుత్వం రుణమాఫీ ఏ ప్రాతిపదికన చేసిందో అర్థం కావడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం వానాకాలానికి సంబంధించిన రైతుబంధు సకాలంలో ఇవ్వడంతో సంతోషంగా వ్యవసాయం చేసుకున్నాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టడానికి ఈ రుణమాఫీని తెరపైకి తెచ్చింది. అర్హత ఉన్నా రుణమాఫీ ఎందుకు కాలేదో అర్థం కావడం లేదు. అధికారులను అడుగుదామంటే బ్యాంకులు రైతులతో కిటకిటలాడుతున్నాయి.
– రవితేజారెడ్డి, రైతు, లత్తీపురం, జోగుళాంబ గద్వాల జిల్లా
రూ.40 వేలు ఉన్నా మాఫీ కాలె..
మల్దకల్ మండలంలోని గార్లపాడు శివారులోని 16, 17 సర్వే నెంబర్‌పై మల్దకల్ సింగిల్ విండో కార్యాలయం నుంచి ఎన్నో ఏండ్ల నుంచి రుణం తీసుకుంటున్నాను. అయితే 2023 డిసెంబర్‌లోపు రుణం రెన్యువల్ చేసుకోవడంతో కేవలం రూ.40వేలు మాత్రమే మిగిలినా తనకు రుణమాఫీ వర్తించలేదు. నాతో పాటు చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఈ విషయంలో బ్యాంకు, వ్యవసాయాధికారులను ఎవరిని అడిగినా ఏమీ చెప్పడం లేదు. ప్రభుత్వం అర్హులందరికీ రుణాలు మాఫీ చేయాలి.
– తిక్కన్న, రైతు, ఎల్కూర్, మల్దకల్ మండలం
అసలు కన్నా.. వడ్డీ ఎక్కువ చూపుతున్నారు..
మల్దకల్ సింగిల్ విండో కార్యాలయంలో జూన్ 2023 లో రూ.39 వేలు అప్పు తీసుకోగా దానిని కూడా డిసెంబర్ నెలలోపే రెన్యువల్ చేసుకున్నా. అయితే ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తనకు వర్తించలేదు. ఈ విషయం పై బ్యాంకు అధికారులను అడగ్గా వ్యవసాయ కార్యాలయంలో అడగమన్నారు. వ్యవసాయ కార్యాలయానికి వె ళితే అక్కడ చూసి తీసుకున్న అసలు అప్పుకన్నా వడ్డీ ఎ క్కువగా చూపుతుంది. అయితే జనవరి నుంచి జూలై వర కు కేవలం రూ.705 వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంది. కా నీ రికార్డుల్లో ఎందుకు ఎక్కువ చూపెడుతున్నదో అర్థం కావడం లేదు.- -నర్సింహులు, రైతు, ఎల్కూర్, మల్దకల్ మండలం