Gadwal | జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వచ్చే వరిధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కేటీదొడ్డి మండలంలోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దు చెక్‌పోస్టును అదనపు కలెక్టర్ నర్సింగ రావుతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వాహనాల ప్రవేశ, నిష్క్రమణ రిజిస్టర్లను పరిశీలించారు. వాహనాల సమాచారం, వే బిల్లులు, వాహనాలు ఏ రాష్ట్రానికి సంబంధించినవో తదితర వివరాలను స్పష్టంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వరిధాన్యాన్ని ఏవిధంగానూ తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతించరాదని స్పష్టం చేశారు.
అనంతరం నందిన్ని గ్రామంలో ఐ.కే.పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతుల ధాన్యాన్ని పరిశీలించి, సేకరణ, రవాణా వివరాలు తెలుసుకొని, సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. డిజిటల్ తేమ మీటర్‌తో ధాన్యం తేమ శాతం పరిశీలించి, 17 శాతం తేమ రాగానే కాంటా వేసి మద్దతు ధరకు కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. గన్నీ బ్యాగులు, హమాలీలు, లారీలు సరిపడా అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం కొనుగొలు అయిన వెంటనే ట్యాబు ఎంట్రీ చేసి, రైతులకు చెల్లింపు జరపాలని అధికారులను ఆదేశించారు. తదనంతరం ధాన్యం గోదామును పరిశీలించి, ధాన్యం నిల్వ వ్యవస్థ పక్కాగా ఉండాలని, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. నిల్వలో ధాన్యం నాణ్యతతో పాటు భద్రతా చర్యలు కూడా తప్పనిసరిగా పాటించాలని స్పష్టంగా సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామి కుమార్, సివిల్ సప్లయ్ డీఎం విమల, కే.టీ దొడ్డి తహసీల్దార్ హరికృష్ణ, సంబంధిత అధికారులు, రైతులు, పాల్గొన్నారు.