నారాయణపేట, జూలై 20: ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా హెల్ప్ సెంటర్లకు వచ్చే ప్రతి ఒక్కరికీ సేవలు అందించి సరైన వివరాలు నమోదు చేసుకునేలా చూడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సూచించారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని 7, 11, 18, 19 వార్డుల్లో ఏర్పాటుచేసిన ఎన్యూమరేషన్ హెల్ప్ సెంటర్లను ఆయన పరిశీలించారు. హెల్ప్సెంటర్లలో ఉచితంగా అందుతున్న సేవలు, దరఖాస్తు నమోదును పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.
కృష్ణ మండలంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న విషయం తెలుసుకొని ఫొటోలు తీసేందుకు అక్కడికి వెళ్లిన నమస్తే తెలంగాణ మాగనూరు రిపోర్టర్ రాము, ఫొటో గ్రాఫర్ తాహేర్పై ఇసుక మాఫియా దాడికి పాల్పడడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి దాడికి పాల్పడిని వారి ని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యులపై నిష్పాక్షిక విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాలోని మెడికల్ కళాశాలలో కేవలం 50 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండడం వలన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో 150 సీట్లు ఉండగా పేట మెడికల్ కళాశాలలో 50 సీట్లకే పరిమితం చేయడంతో పేద విద్యార్థులు వైద్యవిద్యకు దూరమవుతున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కళాశాలలో సీట్లను 50 నుంచి 150కి పెంచే లా చర్యలు తీసుకోవాలన్నారు.