కోస్గి, అక్టోబర్ 27 : ఫార్మా కంపెనీని ఎట్టిపరిస్థితిల్లో అనుమతించేది లేదని.. ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో ఫార్మా సిటీ కోసం రోటిబండ తండాలో సర్వే కోసం శనివారం అధికారులు వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాణాలు పోయినా భూములు ఇవ్వమని రైతులు తెగేసి చెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రెచ్చిపోయి అధికారులు, పోలీసుల ముందే కులం పేరుతో దూషించి బూతు పురాణం మొదలుపెట్టాడు.
ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంతో కాంగ్రెస్ నేతను గ్రామస్తులు బంధించారు. తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు రైతులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఇష్టనుసారంగా చావబాదారు. ఆ ఘటనలో దాదాపు 10మందికి గాయాలయ్యాయి. దీంతో గాయాలైన బాధిత రైతులను కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నష్టం కలిగించే ఫార్మా వద్దని రైతులు లబోదిబోమంటున్నా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న సీఎంకు అర్థంకాకపోవడంతో బాధాకరమన్నారు.
మీ అందరికీ మేం అండగా ఉంటామని, ఎవరికీ భయపడేది లేదన్నారు. ఈ ప్రాంతంలో ఫార్మాను అనుమతించేది లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ బాధిత రైతులకు అండ గా ఉంటుందని భరోసా కల్పించారు. రైతులకు పార్టీ నాయకులతో కొట్టించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. అధికారులు, పోలీసులు ఇదంతా చోద్యం చూస్తూ రైతులపైనే దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. మళ్లీ భూములు ఇవ్వాలని ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చినా కేటీఆర్‌తో కలిసి ధర్నా చేపడుతామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సురేశ్‌రాజ్, చంద్‌పాషా, కోట్ల యాదగిరి, కోట్ల మైపాల్, విష్ణువర్ధన్‌రెడ్డి, బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు.