నాగర్‌కర్నూల్, అక్టోబర్ 23 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాచరిక పాలనను కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో పేదల నడ్డీ విరిచే ప్రయత్నం చేస్తున్నదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 50 వేల పైచిలుకు ఉద్యోగాలు కల్పించినట్లు ప్రగల్భాలు పలుకుతున్నారని.., మీరు చేసిన అభివృద్ధి ఏంటో అందరికీ తెలుసన్నారు.
ఉద్యోగాల కల్పనకు కొంత ప్రాసెస్ ఉంటుందని.., అలాంటివేమీ లేకుండా కేసీఆర్ సర్కారు కల్పించిన ఉద్యోగాలకు ఇప్పుడు నియామక పత్రాలను ఇచ్చి ఫొటోలకు ఫోజులు ఇవ్వడమేనా మీ పని అని ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగావకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నదన్నారు. ప్రజలు, రైతుల కోసం పనిచేస్తున్న ఏఈవోలు, కానిస్టేబుళ్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ అణిచివేత ధోరణి ప్రదర్శిస్తున్నదన్నారు. రాష్ట్రంలో 170 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడం సిగ్గుమాలిన చర్య అని.., వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఉద్యోగులను రెచ్చగొట్టి గత ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు మోపితే సహించేది లేదన్నారు.
ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చలేక ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదన్నారు. ఉద్యోగులతో పెట్టుకుంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. తమను అణిచి వేయాలని చూసిన చంద్రబాబుకు రైతులు కర్రుకాల్చి వాతపెట్టారన్నారు. సాధ్యం కాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నదన్నారు. ముందుగా మీ కుటిలమైన ఆలోచనలను ప్రక్షాళన చేసుకోవాలని, అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలను సరిచేసుకోవాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బైకాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ జెడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలం, ప్రదీప్, భాస్కర్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.