మక్తల్, ఆగస్టు 26 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో భీమా ప్రాజెక్టు సాధనలో స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డిది చెరగని ముద్ర అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం మక్తల్‌లో నిర్వహించిన చిట్టెం నర్సిరెడ్డి 95వ జయంతి సందర్భం గా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు శ్రీహరి, పర్ణికారెడ్డి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.
అనంతరం స్థానిక మినీ ట్యాంక్ బండ్‌పై నర్సిరెడ్డి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠాపన చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్‌గౌడ్ హాజరై మాట్లాడారు. నర్సిరెడ్డి విగ్రహ పునః ప్రతిష్ఠాపనలో తాను పాల్గొనడం ఆనందాన్ని కలిగించిందన్నారు. నేడు ఈ నియోజకవర్గంలో రైతులకు సాగునీరు అందుతుందంటే అది ఆయన చలవేనన్నారు. సార్ చేసిన పోరాట ఫలితంగా భీమాను సాధించుకున్నామన్నారు. రాజకీయంలో ఎలాంటి మచ్చ లేని వ్యక్తి ఆయనని గుర్తు చేశారు.
2005లో అభివృద్ధి పనుల్లో పాల్గొన్న తన తండ్రి, తమ్ముడితోపాటు 9మంది ప్రాణాలు కోల్పోయారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి గు ర్తు చేశారు. ఇద్దరూ లేని లోటును రాజకీయాల్లోకి వచ్చి 18 ఏండ్లుగా ప్రజల్లో చూసుకున్నానన్నారు. వారి సమస్యలను నా సమస్యలుగా భావించి వారికి అండగా నిలిచానని, తన స్వలాభం కోసం ఏనాడూ పనిచేయలేదన్నారు. నా తండ్రి ఆశయాలను నెరవేర్చాలన్న సంకల్పంతో గుండెను రాయి చేసుకొని పుట్టెడు దుఃఖంతో నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచానన్నారు. స్థానిక ప్రజలు నన్ను గుండెల్లో చేర్చుకొని నా వెంటే ఉండడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం మొకవోని దీక్షతో ఉద్యమాలు చేపట్టిన ఘనత నర్సిరెడ్డిదని, రాజకీయాల్లో ఆయన అజాత శత్రువుగా పే రొందారని ఎంపీ అరుణ పేర్కొన్నారు. విలువలతో కూడిన రాజకీయాన్ని నేర్పింది మా తండ్రే అని.. క్రమశిక్షణతో మా కుటుంబంలో గౌరవం కలిగిన వ్యక్తి ఆయనన్నారు. అప్పటి సీఎం వైఎస్సార్ వద్ద గట్టిగా కొట్లాడిన మహా నేత నర్సిరెడ్డి అని, ఆయన పోరాట ఫలితంగానే నేడు మక్తల్‌కు భీమా ఫేజ్-1లో సంగంబండ నుంచి సాగునీటికి నాంది పలికిందన్నారు. సాగునీటి ఉద్యమంలో పాల్గొన్న అన్నారు.
18 ఏండ్ల కిందట ఆగస్టు నెల తమ కుటుంబానికి సంతోషాన్ని దూరం చేసి దుఃఖాన్ని మిగిల్చిందని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. మా తాత నర్సిరెడ్డి పర్యవేక్షణలో నా బాల్యమంతా గడిచిందని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తానన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందుంటానన్నారు.
అలాగే ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ క్రమ శిక్షణ కలిగిన రాజకీయ జీవితాన్ని నర్సిరెడ్డి సార్ నుంచి నేర్చుకున్నానని అన్నారు. తన రాజకీయ జీవితంలో మొద టి విజయాన్ని అందించిన ఘనత ఆయనదే అని గుర్తు చేశారు. అలాంటి మహానుభావుడి విగ్రహ పునః ప్రతిష్ఠలో పాల్గొనడం పూర్వజన్మ సు కృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు, చిట్టెం అభిమానులు, మక్తల్ నియోజకవర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.