దేవరకద్ర రూరల్(చిన్న చింతకుంట), అక్టోబర్ 23 : రైతు భరోసా ఇవ్వాలని రైతులు అడిగితే అక్రమంగా కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేసిన ప్రకటనపై చిన్నచింతకుంట మండలం పర్దీపూర్‌లో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిరసన తెలిపినందుకు వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. దీంతో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బుధవారం పర్దీపూర్ గ్రామంలో వారిని కలిసి మనోధైర్యాన్నిచ్చారు.
ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చేతగాక ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టించడం దారుణమన్నారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతుబంధు సాయాన్ని ఇచ్చినటు ్లగుర్తుచేశారు. కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని ఆపలేరని, ఉద్యమ కాలంలో ఇలాంటి కేసులు చాలా ఎదుర్కొన్నామన్నారు. రైతులకు ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా వెంటనే ఇవ్వాలని, అలాగే రూ.2లక్షల రుణమాఫీ అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేసే వరకు రేవంత్ సర్కారును వదిలేది లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాము, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.