మహబూబ్ నగర్ అర్బన్, ఫిబ్రవరి 8 : మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో కాంగ్రె స్ గెలిస్తే విధ్వంసమే నని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రేమ్‌నగర్, క్రిస్టియన్‌పల్లి, పాతపాలమూరు, శివశక్తి నగర్, భగీరథ కాలనీ, వీరన్నపేట్, సద్దలగుండు డివిజన్లో ఆదివారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ అంధుల ఇల్లు కూలగొట్టడానికి వెళ్లిన వాళ్లు ఇప్పుడు ఓట్లు అడగటానికి వస్తున్నారు. ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. అర్ధరాత్రి ఇండ్లను కూలగొడితే అక్కడికి వెళ్లి ప్రజల పక్షాన పోరాటం చేస్తే అదేదో నేరమైనట్లు మా నాయకులపై కేసులు పెట్టారన్నారు.
మైనారిటీ, క్రిస్టియన్ పిల్లల చదువు కోసం మైనారిటీ గురుకులాలు కడితే వాటిని మధ్యలోనే నిలిపివేశారన్నారు. పింఛన్ రూ.4వేలు, కల్యాణిలక్ష్మితో తులం బంగారం ఇస్తామంటే ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌కు ఓటు వేశారని, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేశాయి.. మళ్లీ ఈ ఎన్నికల్లో కూడా కలిసి ముందుకు వస్తున్నాయి.. రెండు పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.
గతంలో పదిహేను రోజులకు ఒకసారి తాగునీరు వస్తుండే..మేము వచ్చాక రోజు నీరు ఇచ్చాం..ఇప్పుడు కనీసం ఆ నీటిని శుద్ధి చేసి ఇవ్వడం లే దన్నారు.
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిలో మహబూబ్‌నగర్ వెనక్కి పోయిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, మహబూబ్‌నగర్‌లో నిలిచిపోయిన అభివృద్ధితోపాటు కాలనీల్లోని సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరిస్తామన్నారు. పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు సమిష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ ముడా చైర్మన్ గంజి వెంకన్న, నాయకులు అబ్దుల్ రహెమాన్, ఆంజనేయులు, కిశోర్, కృష్ణమోహన్, స్వదేశ్, పల్లె రవి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.