మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీన జీతాలు ఇచ్చినట్లు నటించి.. సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ ఆలోచించి ఓటు హక్కును వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం కోసం ముందుండి పోరాటం చేశారు..కానీ ఇప్పుడు వారే ఇబ్బందులు పడుతున్నారన్నారు. చనిపోయిన విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన ఆర్థికపరమైన బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శించారు. డీఏ లు కూడా ఇవ్వడం లేదు.. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని పేర్కొన్నారు. 317 ప్రభుత్వ ఉత్తర్వులపై స మీక్షించి భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా చేస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు. బదిలీల క్యాలెండర్ ఇస్తామని, జర్నలిస్టులు, ఉద్యోగులకు అన్ని ప్రైవేట్ దవాఖానల్లో ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి మాట తప్పారని.. కనీసం వెల్నెస్ సెంటర్ల్లో కూడా మందులు అందుబాటులో ఉంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీపీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వడం లేదు.. దాచుకున్న డబ్బు లు రాక గుండె పోటుతో పలువురు మృతి చెందారని, ఇవి ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలన్నారు. ఎన్నికలప్పుడు గొప్పగా మాట్లాడిన సీఎం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎక్కువ మొత్తం లో వేతనాలు ఇచ్చామని, కాంట్రాక్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు.
సీపీఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిందని, ఒకటో తేదీ జీతం ఇచ్చామని చెబుతున్న నాయకులు ఇతర సమస్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఉద్యోగి చనిపోతే దహన సంస్కారాల ఖర్చులు డబ్బులు ఇవ్వడం లేదని, జీపీఎఫ్ డబ్బులు ఇవ్వడానికి కూడా 20శాతం డబ్బులు అడుగుతుని ఆరోపించారు. అప్పట్లో విశ్రాంత ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులంటే అందరూ నమ్మె వారు..వెంటనే లోన్లు ..చేతి బదులు ఇచ్చేవారు.. కానీ ప్రస్తుత ప్రభుత్వ తీరుతో ఇప్పుడు వారిని నమ్మడం లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 9 : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరోసారి మోసపోకండి.. కార్పొరేషన్ ఎన్నికల తరువాత మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఏ పార్టీకి వెళ్తారో తెలియదు..పదవి కాలం ముగిసిన తర్వాత మళ్లీ ప్రజలకు కనిపిస్తారో లేదో కూడా చెప్పలేమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని జైనలీపూర్, గొల్లబండ తండా, కిద్వాయిపేట్, పాలకొండ పరిధిలో మాజీ మంత్రి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ఎన్నికల తర్వాత ముఖం చాటేసిన ఆ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారని విమర్శించారు. మళ్లీ ఆ పార్టీకి ఓటు వేసి మోసపోకండి అంటూ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన మెట్టుగడ్డ మార్కెట్, మన్యంకొండ రోప్‌వే, బస్టాండ్ వద్ద హోటల్ వంటి అనేక అభివృద్ధి పనులు పూర్తిచేయక పోవడంతో సీకులు తుప్పపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వెయ్యి పడకల దవాఖాన నిర్మాణం చేసి ఇస్తే కనీసం అందులో పరికరాలు..వసతులు కలిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. పేదలు వైద్యం అందక హైదరాబాద్‌కు పరుగులు పెడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని మండ్డిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి వెనక్కి వెళ్లిందని..మేము మళ్లీ అధికారంలోకి వస్తాం..నిలిచిపోయిన అభివృద్ధి పనులతో పాటు కొత్త పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ వెంకన్న పాల్గొన్నారు.