పాలమూరు, మే 28 : ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండించి అమ్ము కుందామన్న సర్కారు కొంటలేదని రైతు గుండె బరువెక్కి ఇంట్లో బియ్యం తినాల్సిన రైతు నూకలను కొని తినాల్సిన పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి జిల్లాలో రైతులను కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటు న్నారని. ఇదెక్కడి ప్రభుత్వమని నిలదీశారు. గురువారం మహబూబ్ నగర్ సమీపంలోని మిల్లును ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడా రు. ధాన్యం కొనుగోలు చేయాలని రెండు నెలలుగా కష్టాలు పడ్డా మని, చివరకు మిల్లులకు తరలిస్తే తరుగు పేరిట మద్దతు ధర లేకుండా చేస్తున్నారని పలువురు ఆవేదన చెందారు. తడిసిన ధాన్యం కొంటామని చెప్పి అది కూడా కొనడం లేదని వాపోయారు.
వచ్చిన కాడికి అమ్మిన రైతులు మిల్లుల నుంచి నూకలు కొంటుంటే చూసి మాజీ మంత్రి చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వంలో ఎంతో గౌరవంగా బతకాల్సిన రైతులు చివరకు బియ్యం పం డించి నూకలు తినాల్సిన పరిస్థితికి తీసుకువచ్చిందని మండిపడ్డారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నది.. కానీ మంచిగా ఉన్న ధాన్యం కూడా కొనడం లేదన్నారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. రోహిణి కార్తె రావడంతో పంటల సాగుకు రైతులు సిద్ధమవుతుంటే కనీసం పిండి సంచులు లేవు.. ఎరువులు అందుబాటులో లేవన్నారు. విత్తనాలు దొరకని పరిస్థితుల్లో రైతులు బిక్కు బిక్కుమంటున్నారన్నారు.
పెట్టుబడి సహాయం కోసం రైతు భరోసా లేదు.. ఫలితంగా మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయి ంచాల్సి వస్తుందన్నారు. రుణ మాఫీ లేదు.. సకాలంలో కరెంట్ ఇవ్వలేదు.. ఆరుగాలం కష్టం చేసి పండిన పంట కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. పాలమూరు పనులు పూర్తి చేసేందుకు టెండర్లు పిలిచినా రద్దు చేశారని మండిపడ్డారు. ప్రాజెక్ట్ పూర్తి చేయమంటే మం త్రులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని.. మేము అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అన్నీ అందుబాటులో పెట్టాము.. పంట కొనుగోలు చేసి రైతుబంధు సకాలంలో విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ వచ్చి రెండున్నరేండ్లు అయినా రైతులకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఇదే రకమైన పాలన కొనసాగితే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి వెంట గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, నర్సింహారెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, రాఘవేందర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.