వనపర్తి, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ) : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లంబాడీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లంబాడీ భేరీ సన్నాహక సమావేశం బీఆర్ఎస్ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి నివాసంలో నిర్వహించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈ నెల 26న తలపెట్టిన లంబాడీల భేరీకి జిల్లా సంఘం నాయకుల విజ్ఞప్తి మేరకు ఆయన పూర్తి మద్దతును ప్రకటించారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ లంబాడీలు తమ హక్కులను కాపాడుకునేందుకు ఐక్యమత్యంగా కదలిరావాల్సిన అవసరం ఉందన్నారు. లంబాడీల కోసం సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు రిజర్వేషన్ల అమలు, గ్రామ పంచాయతీలుగా తండాలను ఏర్పాటు చేయడం, పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతోపాటు వివిధ సంక్షేమ పథకాలను విరివిగా అమలు చేయడం జరిగిందన్నారు. లంబాడీల రిజర్వేషన్లకు ఎలాంటి భంగం కల్గించకుండా వారి అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు తోడ్పాటునందించిందని చెప్పారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పని చేస్తున్న వారే లంబాడీల హక్కులకు నష్టం కల్గించేలా కోర్టుకు వెళ్లారని, ఎస్టీ ప్రజలు దీనిపై అప్రమత్తం కావాలని పేర్కొన్నారు. లంబాడీల నోటికాడి ముద్దను కాంగ్రెస్ గుంజుకోవాలని చూస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. ఆదివాసీల అభివృద్ధికి ఏమాత్రం తాము వ్యతిరేకం కాదని, అలాగని గిరిజనులకు రిజర్వేషన్ల పరంగా నష్టం కల్గిస్తామంటే చూస్తూ ఉండబోమన్నారు.
లంబాడీల భేరీకి కదలిరావాలి
వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ నెల 26న జిల్లా ఎస్టీసెల్ ఆధ్వర్యంలో తలపెట్టిన లంబాడీల భేరికి గిరిజనులు అధిక సంఖ్యలో కదిలి రావాలని బీఆర్ఎస్ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయక్, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, జాతృనాయక్ విజ్ఞప్తి చేశారు. జిల్లా సంఘం ఆధ్వర్యంలో మాజీ మంత్రి నివాసంలో నిర్వహించిన సన్నాహక సమావేశం అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టేందుకు లంబాడీల సదస్సును నిర్వహిస్తున్నామన్నారు.
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలను కాంగ్రెస్ విరమించుకోవాలని లేనిపక్ష్యంలో రేవంత్‌రెడ్డి సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గిరిజన సంఘం నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సీతక్క ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని సుప్రీం కోర్టులో కేసులు వేయించడాన్ని జిల్లా ఎస్టీ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే సదస్సుకు ప్రతి తండా నుంచి లంబాడీలు తరలి వచ్చి ప్రభుత్వం కండ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు నారాయణనాయక్, టీక్యానాయక్, కృష్ణనాయక్, గోపాల్ నాయక్, పీన్యానాయక్, సక్రూనాయక్,రాజ్‌కుమార్, గోవింద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయంతోపాటు పాడిపరిశ్రమ అభివృద్ధి చెందాలి
గోపాల్పేట, సెప్టెంబర్ 23 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సాగునీటి రాకతో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని, ఎటు చూసినా పచ్చని పంటలతో పల్లెలు కళకళ లాడుతున్నాయని, వ్యవసాయంతోపాటు లాభదాయకమైన పాడిపై రైతులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. పెరిగిన నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వం పాడిరైతులకు గిట్టుబాటు ధర అందించాని కోరారు. మంగళవారం మాజీ మంత్రి మండలంలోని చాకల్‌పల్లి గ్రామం లో రైతుబంధు గ్రామ అధ్యక్షుడు లొంక శేషిరెడ్డి, రైతు ఆంజనేయులు డెయిరీ పామ్ పరిశీలించి డెయిరీ నిర్వహణ పై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో పాడి రైతులకు గిట్టుబాటు ధర అందేదని, కాంగ్రెస్ సర్కార్ వచ్చాక దాణా ధర కూడా పెరిగిందని, పాల ధర తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయ డెయిరీకి కాంపిటీషన్‌గా హెరిటేజ్, ఇతర సంస్థలు రావడంతో రైతులకు మద్దతు ధర చెలించేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. గతంలో విజయ డెయిరీ వారు లీటరు పాలకు రూ.42 ఇచ్చేవారు. ప్రతి యేటా పెంచేవారు. ఇప్పుడు ప్రభుత్వం రూ.34 వరకు ఇస్తుండడంతో రైతులకు నిర్వహణ ఖర్చు ఎక్కువై రాబడి తగ్గడం వల్ల పాడిపై రైతులు ఉత్సాహం చూపడం లేదన్నారు.
గతం లో చాకల్‌పల్లిలో 50 వరకు డెయిరీ ఫామ్స్ ఉండగా, కాంగ్రెస్ సర్కారు వచ్చాక పాడి రైతులకు గిట్టుబాటు ధర అందించకపోవడంతో సుమారు 30మంది డెయిరీ ఫా మ్స్ మానుకున్నారన్నారు. రోజు గ్రామంలో 5వేల లీటర్ల పాటు అమ్ముడు పోయేదని, ఇప్పుడు 2వేల లీటర్లలోపే పోతున్నాయన్నారు. ప్రభుత్వం పాడి రైతు లకు గిట్టుబాటు ధర అందిస్తే చాలా మంది రైతులు డెయిరీ ఫామ్స్‌పై మక్కువ చూపుతారన్నారు.
అనంతరం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పాడి రైతులకు గిట్టుబాటు ధర అందించి ఆదుకుంటే డెయిరీలు మూతపడకుండా ఉంటాయని, ప్రభుత్వం పాడి పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లెద్దుల బాలరాజు, గ్రామ అధ్యక్షుడు మానేశ్బాబు, గుండ్రాతి రాజేశ్‌గౌడ్, మాజీ వైస్‌ఎంపీపీ చంద్రశేఖర్, మాజీ కొఆప్షన్ సభ్యుడు ఎండీ మతీన్, రైతులు మన్యంనాయక్, తిరుపతయ్యగౌడ్, లొంక లక్ష్మారెడ్డి, వెంకటేశ్, నాగిరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, ఉశ న్న, నాగయ్య, నాగరాజుగౌడ్ తదితరులు ఉన్నారు.