జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 3 : కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మకై సీబీఐ పేరుతో డ్రామాలాడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం జడ్చర్లలోని అంబేద్కర్ కళాభవన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఏ స్థాయి వారైనా తప్పు చేస్తే చివరకు సొంత బిడ్డలైనా ఊపేక్షించేదిలేదని గతంలో కేసీఆర్ చెప్పారన్నారు.
గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. కన్నబిడ్డ కంటే పార్టీ, పార్టీ కార్యకర్తలే ముఖ్యమని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిచాల్సినవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ అంశంతో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని కాలగర్భంలో కలిసిపోతుందని కాంగ్రెస్, బీజేపీ నాయకు లు సంబురపడుతున్నారని, కానీ బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మరింత బలంగా అయిందే తప్పా ఎప్పుడూ కుంగిపోలేదన్నారు.
కవిత సస్పెన్షన్ అంశంతో పార్టీకి ఎ లాంటి నష్టం లేదని.. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ మరింత బలంగా అవుతుందన్నారు. అధికారం కోస మే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిం ది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. ప్రాణాలకు తెగించి పోరాటం చేసి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణను పదేండ్ల కాలంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాక ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక ఎలాగైనా కేసీఆర్‌పై బురదజల్లాలని దురాశతో కాళేశ్వరం పేరును వాడుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఏకంగా ప్రధానమంత్రి మోదీ చేసిన ఆరోపణలపై ఎందుకు విచారణకు అడగడంలేదో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కాకపోతే వెంటనే ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ చేయించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి మాజీ మంత్రి సవాల్
తనను ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టవద్దని చెప్పి తాను కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి అడిగినట్లు ఇటీవల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపించాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో అనిరుధ్‌రెడ్డి పోటీ నుంచి తప్పుకోవాలని, ఒక వేళ కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసినట్లు సాక్ష్యాధారాలతో నిరూపిస్తూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేయటం చేతగాక తన పై అనవసర ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కాలం వెల్లదీస్తున్నాడన్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిరూపించలేకపోయినట్లు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కోడ్గల్ యాదయ్య, సుదర్శన్‌గౌడ్, పిట్టల మురళి, ప్రణీల్‌చందర్, ఇంతియాజ్, నాగిరెడ్డి, నందకిశోర్‌గౌడ్, లత, ప్రశాంత్‌రెడ్డి, రఘుపతిరెడ్డి ఉన్నారు.