మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 15 : జిల్లా కేంద్రం వీరన్నపేట శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. రెండున్నర నెలలుగా తరుచూ కనిపిస్తుండడంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నప్పటికీ దాని ఆచూకీ లభించకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. గత మూడు నెలలుగా అదే అటవీ ప్రాంతంలోని కుక్కలను, చిన్న జంతువులను తింటూ ఉండే చిరుత సోమవారం బోనులో ఉన్న మేకను తినడానికి బోనులోకి వచ్చి చిక్కుకుంది. బోనులో చిరుత చిక్కుకుందని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి చిరుతను పరిశీలించారు.
అక్కడి విషయం బయటికి తెలియడంతో ప్రజ లు చిరుతను చూసేందుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ నుంచి చిరుతను తరలించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజలకు కం టి మీద కునుకు లేకుండా చేస్తు న్న చిరుతపులి ఎట్టకేలకు చిక్కడంతో జిల్లా కేంద్రంలోని టీడీ గుట్ట ప్రాంత వాసులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలు నేరుగా చిరుత పులిని చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. చాలా మంది ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ఓ వైపు అటవీ అధికారులు, పోలీసులు దగ్గరికి రావొద్దని వారిస్తున్నా ప్రజలు వినిపించుకోకుండా ఎగబడ్డారు.
సోమవారం ఉదయం 7:30 గంటలకు బోనులో చిక్కిన ఆడ చిరుతను ఫీల్డ్ డ్యూటీలో ఉన్న సిబ్బం ది ఉదయం 10:30కు గుర్తించారు. చిరుతను బంధించిన ప్రాంతాన్ని చుట్టముట్టి భద్రత కల్పిం చి, స్థానిక ప్రజల రాకపోకలు నిలిపివేసి, పోలీసుల సహకారంతో ప్రాంతాన్ని సురక్షితం చేశారు. అనతరం వెటర్నరీ వైద్యుడిని పిలిపించి చిరుతను పరిశీలించగా బో నులో తన్నుకోవడం వల్లన స్వల్పగాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సిబ్బంది ట్రాక్టర్ సాయంతో బోనును కొండపై నుంచి కిందికి తీసుకువచ్చి డీసీఎం వాహనంలో ఎక్కించి హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు సురక్షితంగా తరలించారు.