తాడూరు/నాగర్కర్నూల్, సెప్టెంబర్ 1 : తాడూరు మండలంలో ని సిర్సవాడ, పాపగల్ గ్రామాల మధ్యలోని దుందుభీ వాగుకు తీవ్ర వరద వస్తున్నది. ఈ వరదల్లో 200 గొర్రెలు, ఇద్దరు కాపరులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వా డ్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రోజు మాదిరిగానే సిర్సవాడ గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు మల్లయ్య, ఆంజనేయులు గొర్రెలను మేపేందుకు దుందుభీ సమీపంలోకి వెళ్లారు.
ఒక్కసారిగా వాగు ఉధృతంగా రావడంతో వాగు మధ్యలో ఉన్న గడ్డపైకి గొర్రెలతోపాటు చేరుకొని అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న కలెక్టర్, ఎస్పీ ఆదివారం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. డ్రోన్ కెమెరా సాయంతో వాగు మధ్యలో ఉన్న కాపరులు, గొర్రెలను గుర్తించారు. సోమశిల నుంచి పుట్టీని, జాలరులను రప్పించి ఎట్టకేలకు గొర్రెల కాపరులను సురక్షితంగా
కాపాడారు. గొర్రెలు మా త్రం అక్కడే ఉన్నా యి.