గద్వాల, జూలై 25 : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా.. జూరాలకు వరద ఉధృతంగా వచ్చినా వాటిని నిల్వ చేసుకోలేని దుస్థితి నెలకొన్నది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీనత వెరసి రైతులకు శాపంగా మారింది. వర్షాకాలం ప్రారంభమైందంటే ఎగువ నుంచి జూరాలకు వరద వచ్చి చేరుతున్నది. కాగా, వచ్చిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి నెలకొన్నది. గతంలో పాలించిన టీడీపీ, కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా కండ్ల ముందే వందల కొద్ద్దీ టీఎంసీల నీరు దిగువకు వెళ్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది.
వరద వచ్చిన సమయంలోనైనా ఉన్న రిజర్వాయర్లను నీటితో నింపడంతోపాటు కాల్వల ద్వారా చెరువులను నింపితే రెండో పంటకు నీరు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా పాలకులు, అధికారులు కృషి చేయడం లేదు. జూరాల ప్రాజెక్టు ప్రారంభమై నేటికి 29సంవత్సరాలు
కావస్తున్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా జూరాల ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో కాల్వల నిర్మాణం చేపట్టలేదు. పిల్ల కాల్వలు అస్త వ్యస్తంగా ఉండడంతో అను కున్న ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెల కొన్నది.
ప్రాజెక్టు ద్వారా సుమారు లక్షా 20వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ప్రాజెక్టుకు రెండు ప్రధాన కాల్వలను ఏర్పాటు చేశారు. కుడి కాల్వను సోమనాద్రి కాల్వగా పిలుస్తారు. ఈ కాల్వ సుమారు 51 కిలోమీటర్లు ప్రవహించి గద్వాల, అలంపూర్ నియోజకవర్గంలోని 37,700 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది.ఈ ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా ఆత్మకూర్, వనపర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లోని 64,500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది.
ఈ ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా పిలుస్తారు. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ప్రాజెక్టు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నది. ప్రాజెక్టు గేట్లు ఎత్తే రోప్‌లు తెగిపోవడం, ప్రాజెక్టులో షిల్ట్ పేరుకపోవడం వల్ల 11టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నా ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 9.657 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే పరిస్థితి నెలకొన్నది. ఈ ప్రాజెక్టు మరమ్మత్తుల కోసం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అన్ని అరకొర నిధులు విడుదల చేయడం వల్ల ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి స్థాయిలో చేయడం లేదు.
ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా ఉండాలంటే జూరాల ప్రాజెక్టు కింద అదనపు రిజర్వాయర్ల నిర్మాణం తప్పనిసరిగా మేధావులు అభిప్రాయపడుతున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలతోపాటు రైతులు, సాగు, తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. వర్షాభావ పరిస్థితుల నుంచి ఉపశమనం కలగాలంటే ఈ ప్రా జెక్టు పరిధిలో అదనపు రిజర్వాయర్లు తప్పనిసరిగా నిర్మా ణం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పాలకులు ప్రయత్నాలు చేస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు, రైతులకు ఎటువంటి సాగు,తాగు నీటికి ఢోకా ఉండదు.
ఈ ఏడాది ముందస్తుగానే ఎగువన వర్షాలు కురువడంతో జూరాల ప్రాజెక్టుకు ముందుగానే వరద ప్రారంభమైంది. జూరాల ప్రాజెక్టుకు మే చివరి వారంలో వరదలు ప్రా రంభం కాగా, ఇప్పటి వరకు 275 టీఎంసీల వరద వచ్చింది. అందులో మనం వినియోగించుకున్న నీరు కేవ లం 10.65 టీఎంసీలు మాత్రమే. జూరాల ప్రాజెక్టు బ్యా క్ వాటర్ ద్వారా నెట్టెంపాడ్ ప్రాజెక్టు రూపొందించి, దీని కింద గుడ్డెందొడ్డి లిఫ్ట్‌తోపాటు ఆరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏర్పాటు చేసినా వాటిని ఇప్పటి వరకు నింపుకొనే ప్రయత్నం మన పాలకులు, అధికారులు చేయలేదు.
దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడ్ కాల్వకు 2.71 టీఎంసీలు, బీమా లిఫ్ట్-1, లిఫ్ట్-2కు 2.42 టీఎంసీలు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు 1.29టీఎంసీలు, జూరాల ప్ర ధాన కుడికాల్వకు 1.06 టీఎంసీలు, ఎడ మ కాల్వ ద్వారా 1.87 టీఎంసీలు, విద్యుత్ ఉ త్పత్తికి 1.096 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకున్నట్లు అధికారులు చెప్పిన లెక్కల ద్వారా తెలుస్తున్నది. గేట్ల ద్వారా మొత్తం దిగువకు 255.36 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారుల ద్వారా తెలిసింది.
జూరాల కుడి, ఎడమ కాల్వల ఎత్తు పెంచితే ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటు ంది. అయితే ఈ ప్రతిపాదనను 2010లో అప్పటి ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వం ఎదుట ప్రతిపాదన పెడితే ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. కా ల్వల ఎత్తు పెంచితే చివరి ఆయ కట్టు వరకు ఎటువంటి ఇబ్బం దులు లేకుండా నీరు ఇవ్వొచ్చని అధికారులు ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. జూరాల కాల్వల ఎత్తు పెంచితే ఎక్కువ ఆయ కట్టుకు నీరు ఇవ్వడానికి అవకాశం ఉన్నది.