కొల్లాపూర్, ఆగస్టు 2 : రైతు రుణమాఫీ గందరగోళంతో రైతులు ఇక్కట్లు పడుతున్నారు. అర్హత ఉన్న రుణమాఫీ కానీ వారు రూ.లక్ష రుణమాఫీకి కేవలం పదివేలలోపు రుణమాఫీ అయిన వారు పంటల సీజన్లో పొలాలను బీడులుగా పెట్టుకొని బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. తిండితిప్పలు మాని బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్న రైతుల పరిస్థితి దీనంగా ఉంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని చాలా మంది రైతులకు ఆంక్షల పేరుతో రుణమాఫీకి టోకరా పెట్టారు.
శుక్రవారం రుణమాఫీ కోసం వచ్చిన రైతులను సోసైటీ బ్యాంకులో సిబ్బంది రాకుండా గేట్లకు తాళాలు వేశారు. దీంతో మహిళలు, వృద్ధులు బ్యాంకులోకి వెళ్లేలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది రైతులు గోడలను దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేసి గాయాలపాలయ్యారు. మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన కౌడిశాలయ్య రైతు కొల్లాపూర్ సొసైటీ బ్యాంకులో రూ.50వేలు క్రాప్లోను తీసుకున్నాను. కానీ రుణమాఫీ లిస్టులో కేవలం రూ.13,050 మాత్రమే మాఫీ అయినట్లు లిస్టు వచ్చింది.
ప్రభుత్వ ఆంక్షలతో భారీ ఎత్తున లబ్ధిదారులను వడబోతపోసినట్లు రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పేరుకు మాత్రమే రుణమాఫీ చేసిందని వాస్తవ పరిస్థితిలో రుణమాఫీ కానీ వారి సంఖ్య అధికంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మభ్యపెట్టి పది మంది రైతులకు రుణమాఫీ చేసి 90 మంది రైతులకు రుణమాఫీ చే యలేదని బాధిత రైతులు వాపోతున్నారు. ప్రభు త్వం వెంటనే ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
రూ. 50వేల రుణమాఫీలో రూ.13,050 మాత్రమే మాఫీ అ య్యింది. ఎందుకు ఇలా జరిగిందని తె లుసుకునేందుకు మూడు రోజుల నుంచి బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా. ఈ రోజు ప్రా ణాలకు తెగించి బ్యాంకులోకి వెళ్లి అధికారులను అడిగితే చూస్తాం అని చెబుతున్నారు తప్పా రుణమాఫీ అవుతోందని మాత్రం చెప్పడం లేదు. ఏది ఏమైనా నాకు న్యాయం చేసి రుణమాఫీ చేయాలి.
– కౌడిశాలయ్య, రైతు, చింతలపల్లి, కొల్లాపూర్ మండలం