హన్వాడ, ఆగస్టు 21 : మండలంలోని రైతు సేవా సహకార సంఘం బ్యాంక్లో మొత్తం 2,459 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ కోసం డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 19, 2023 మధ్య రుణాలు తీసుకున్న రైతుల పేర్లు పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 401మంది రైతుల పేర్లు పంపించగా వీరిలో 220మందికే రుణమాఫీ వచ్చింది.
వీరిలో రూ.లక్షలోపు ఉన్న వారు 201మంది, రూ.1.50 లక్షల లోపు ఉన్నవారు 17మంది, రూ.2 లక్షల వరకు ఉన్న వారు ఇద్దరికి మాత్రమే రుణమాఫీ రావడంతో రైతులు ఆయోమయంలో పడ్డారు. ఏపీజీవీబీలో వెయ్యి మంది రుణాలు తీసుకుంటే 705 మందికే రుణమాఫీ అయ్యాయి. మిగతా వారికి కాలేదు. హన్వాడ ఎస్బీఐలో 1,500 మందికి రు ణాలు తీసుకోగా కేవలం 450 మందికి రుణమాఫీ వచ్చింది.
మిగతా వారికి రేషన్ కార్డులో పేరు లేదని, ఆధార్లో తప్పులున్నాయని, బాధిత రైతు చనిపోయాడని, తదితర సాకులతో రుణాలు మాఫీ చేయలేదు. ఇలా మూడు జాబితాల్లో పేర్లు రాని రైతులు వ్యవసాయ, బ్యాంక్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మాకు ఎందుకు మాఫీ కాలేదని అడిగితే అధికారుల నుంచి సరైన సమాధానాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరివి ఒకే రేషన్ కార్డులో ఇద్దరు పేర్లు ఉంటే రుణమాఫీ రావడంలేదని చెబుతున్నారు. రైతులను మోసం చేసిన ప్రభుత్వానికి ఉసురు తాకుతుందని శాపనార్థాలు పెడుతున్నారు.