అమరచింత, ఏప్రిల్ 9 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ కింద పంటలు సాగు చేసిన రైతులు నీరు పారబెట్టుకునేందుకు రాత్రి, పగలు తేడా లేకుం డా కాల్వల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఆత్మకూర్ మండలంలోని జూరాల, గుంటిపల్లి, మోట్లంపల్లి, ఆరెపల్లి, కత్తెపల్లి, మూలమల్ల, అమరచింత మండలంలోని నందిమల్ల, కిష్టంపల్లి తదితర గ్రామాల్లోని రైతులు వేల ఎకరాల్లో వరి పంటను సాగుచేయగా, వారబంధీ లెక్కన వారంలో నా లుగు రోజులు సాగునీరు విడుదల చేస్తున్నా రు.
అధికారులు మంగళవారం రాత్రి సాగునీటిని విడుదల చేయవలసి ఉండగా, జూరాల ఎడమ కాల్వతోపాటు డీ-6 జూరాల గ్రామ శివారులో ఉన్న డీ 6 కెనాల్ వద్ద బుధవారం ఉదయం సాగునీటి కోసం పడిగాపులు కాయగా, వస్తున్న కొద్దిపాటి సాగునీరు తమ పంట పొలాలకు పారబెట్టెందుకు కట్టలు వేసుకోవాలని రైతులు చర్చించుకోవడం కనిపించింది. పంటలకు ఇంకా రెండు తడులు అందితేనే పూర్తిస్థాయిలో రైతులకు పంట చేతికి వస్తుందని రైతులు చెబుతున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకొని పంటలకు సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.