దేవరకద్ర, నవంబర్ 13 : ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని రైతులు రోడ్డెక్కారు. వారం కిందట సెంటర్లను ప్రారంభించినా నేటికీ ఒక్క బస్తా కూడా సేకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం దేవరకద్ర మండలం గోపన్‌పల్లి రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, ఉప్పరి రమేశ్ సాగర్ మాట్లాడుతూ గ్రామాల్లో వరి కోతలు కోసి నేరుగా కేంద్రాలకు తీసుకొని ధాన్యం విక్రయానికి తీసుకొచ్చారని తెలిపారు. కానీ అసలు కొనుగోలే చేయడం లేదన్నారు.
పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్నా అధికారులు మాత్రం జాప్యం వహిస్తున్నారన్నారు. ధాన్యం తూర్పు పట్టే వరకు కొనుగోలు చేయమని చెప్పడం చూస్తే రైతులపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అర్థమవుతోందన్నారు. సన్నాకు రూ.500 బోనస్ ఇవ్వడం దేవుడెరుగు ముందుగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామా ల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరరం సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రైతులు కోట్ల వెంకట్‌రెడ్డి, నక్క వెంకట్రాములు, గౌని రఘువర్ధన్‌రెడ్డి, ఉప్పరి చిన్న వెంకటేశ్, కుమ్మరి హన్మంతు, కాటం నరేందర్‌రెడ్డి, కోట్ల మహేశ్వర్‌రెడ్డి, గొల్ల రాములు పాల్గొన్నారు.