మూసాపేట(అడ్డాకుల), మే 5: వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. నెల రోజులుగా పంటను కోసి ధాన్యం విక్రయించాలని ఎదురుచూస్తున్నా.. సేకరణ చేయడం లేదని ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డుకు అడ్డంగా కంప, రాళ్లు పెట్టి ఆందోళన చేపట్టారు. అడ్డాకుల మండలంలోని పొన్నకల్లో వరిధాన్యం సేకరించడం లేదని అధికారులను శనివా రం నిలదీయడంతో సోమవారం తాసీల్దార్ గ్రామ పంచాయతీ వద్దకు వస్తారు. మాట్లాడుదామని రైతులకు సర్దిచెప్పినట్లు తెలిపారు. అందుకు సోమవారం ఉదయం 9గంటల నుంచే పొన్నకల్ రైతులంతా జీపీ సమీపంలో రోడ్డుపై నిరీక్షించారు.
తాసీల్దార్ శేఖర్ గ్రామానికి వచ్చారు. రైతులు ఉన్నచోట కాకుండా నేరుగా గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లారు. తాసీల్దార్ను రైతులు అక్కడికే రావాలని, జీపీ వద్దకు వస్తే మా సమస్యలు విన్నవించుకుంటామని ఫోన్ద్వారా కోరినట్లు తెలిపారు. కానీ అం దుకు తాసీల్దార్ మీ గ్రామంలోనే ఉన్న కొనుగోలు కేంద్రం వద్దకే రావాలని సూచించారు. అందుకు ఆగ్రహించిన రైతులు తమ ధాన్యం సేకరణ చేయనందుకే తాసీల్దార్ జీపీ వద్దకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుకు ఇరువైపులా కంప, రాళ్లను తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా వేసి ఆందోళన చేశారు. అక్కడికి చేరుకున్న ఏపీఎం సుధీర్కుమర్ కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యం తీసుకోస్తే కొనుగోలు చేస్తామని చెప్పారు.
అందుకు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామం మొ త్తం ఇక్కడే ఉండడంతోపాటు వ్యవసాయ పంట లు కూడా గ్రామం చుట్టూ ఉన్నాయని, మీరు పొన్నకల్కు అనుబంధ గ్రామం దుబ్బపల్లి వద్ద కొనుగోలు కేంద్రం ఎలా ఏర్పాటు చేశారని నిలదీశారు. మేమంతా ధా న్యం ఈ గ్రామం నుంచి మరో గ్రామానికి తీసుకొని రావాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయని, ఖర్చుతోపాటు అక్కడ ధాన్యం కాపాడుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుందని ఆరోపించారు. వర్షం వస్తే దిక్క తోచక ధాన్యాన్ని వదిలేయాల్సి వస్తుందని ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై తాసీల్దార్ శేఖర్ ఉన్నతాధాకారులతో చర్చించినట్లు తెలిపారు. ఘటనా స్థలం వద్ద వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు రైతులతో వాగ్వాదానికి దిగారు.
రైతుల సమస్యను వివరించడంతో మిన్నకుండిపోయారు. అంతలోపే ఎస్సై శ్రీనివాసులు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. రైతులతో చర్చించి సమస్య ఉంటే తాసీల్దార్తో మాట్లాడాలని, నేను కూడా తాసీల్దార్తో మాట్లాడుతానని సర్దిచెప్పడంతో వాహనాల రాకపోకలను వదిలేశారు. ఈ విషయంపై తాసీల్దార్ రైతులతో ఫోన్లో మాట్లాడుతూ.. సమస్యను జిల్లా అధికారులతో చర్చించామని, ఉన్నతాధికారుల సూచన మేరకు లారీలు వచ్చే అవకాశం ఉన్నచోట గ్రామంలోనే ధా న్యం కొనుగోలు చేస్తామని, లేకుంటే ట్రాక్టర్లకు కూడా అనుమతి ఇస్తామని చెప్పడంతో శాంతించారు.