గద్వాల, సెప్టెంబర్ 22 : తమ భూమిని ఒక వర్గానికి చెందిన వారు ఆక్రమించారని, తమకు హైకోర్టులో అనుకూలంగా తీర్పు ఇచ్చినా సదరు భూమిపై కోర్టు స్టే ఉన్నప్పటికీ ఒక వర్గానికి చెందిన వారు తమ భూమిని ఆక్రమించి అక్కడ షెడ్డు వేశారని, వేసిన షెడ్డును తొలగించి తమకు న్యాయం చేయాలని గద్వాల పట్టణానికి చెందిన 8మంది రైతు కుటుంబాలు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని, తమకు న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో రైతులను అక్కడ ఉన్న పోలీసులు కలెక్టరేట్‌లోకి వెళ్లడానికి అనుమతించకపోవడం, తమకు న్యాయం జరగదని భావించి, ఓ రైతు పురుగుల మందు తాగడానికి ప్రయత్నించగా ఆ రైతు నుంచి పోలీసులు పురుగుల మందు డబ్బాను లాక్కొన్నారు.
సమస్యకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గద్వాల పట్టణం పాత ఎస్బీహెచ్ ప్రాంతంలో నివాసం ఉండే నర్సింహులు, చిన్నయ్య, వెంకటనర్సింహులు, శ్రీనివాసులు, నాగరాజు, తిప్పన్న, పద్మావతి, రామస్వామి, వెంకటేశ్, రామకృష్ణ, సురేశ్, పరశురాముడు తదితరులకు వారి పూర్వికులకు సంబంధించి గద్వాల నుంచి అయిజకు వెళ్లే ప్రధాన రహదారిలో 897, 899 సర్వే నెంబర్లో 28ఎకరాల 20గుంటల భూమి ఉంది. ఈ భూమి 1920 వరకు రక్షిత కౌలుదారుగా ఎర్ర చిన్నయ్య ఉన్నాడు. 1950లో కౌలు చట్టం ఆధారంగా అప్పటి తాసీల్దార్ ఎర్రచిన్నయ్య పేరు మీద రిజిస్టర్ చేసినట్లు బాధిత కుటుంబాలు తెలిపాయి. 1954 తర్వాత రికార్డులో ఆ భూమి ఖాస్రపహాణిలో మజీద్ పేరు నమోదు చేసినట్లు చెప్పారు.
అయితే 2008 వరకు పొలంను తామే సాగు చేస్తున్నట్లు బాధిత కుటుంబాలు తెలిపాయి. అయితే 2015 సంవత్సరంలో అప్పటి ఆర్డీవోగా పని చేసిన అబ్దుల్ హామీద్ దానికి ఓఆర్సీ ఇచ్చి వక్ఫ్‌భూమి మార్చారని చెప్పారు. దీనిపై తాము హైకోర్టుకు వెళ్లగా హైకోర్టు స్టే ఇవ్వడంతోపాటు తమకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు బాధితులు తెలిపారు. అయినప్పటికీ ఇప్పటి వరకు తమకు పాస్ పుస్తకాలు మంజూరు చేయలేదన్నారు. పాస్ పుస్తకాల కోసం భూభారతిలో కూడా దరఖాస్తు చేసినట్లు బాధిత కుటుంబాలు తెలిపాయి. కోర్టు కేసు లో ఉండడంతో పాటు ఆ భూమిపై హైకోర్టులో స్టే ఉండగా ఓ వర్గానికి చెందిన వ్యక్తులు అక్కడ షెడ్డు వేసి పొలం చుట్టూ ఫినిషింగ్ చేసి హైకోర్టు ఉత్తర్వు లు ఉల్లఘించినట్లు బాధితులు చెప్పారు.
పనులు నిలుపుదల చేయాలని అదనపు రెవెన్యూ కలెక్టర్‌కు గత నెల 23న ఫిర్యాదు చేశామని అయినా అదనపు రెవె న్యూ కలెక్టర్ మాట బేఖాతర్ చేస్తూ అక్రమంగా పొ లంలో పనులు చేస్తున్నారని చెప్పారు. అక్కడ చేపడుతున్న అక్రమ నిర్మాణం ఆపాలని అదనపు కలెక్టర్‌కు గతంలో ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఓ వర్గానికి చెందిన వ్యక్తులు హైకోర్టు ఆర్డర్, అదనపు కలెక్టర్ మాటలును లెక్క చేయకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం తమకు భూమికి సంబంధించి పాస్ పుస్తకాలు ఇవ్వాలని, అక్కడ ఓ వర్గం వారు అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని నిలుపుద చేయాలని లేని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం బాధిత రైతులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.