పెంట్లవెల్లి, మే 13 : రైతులు ఆరుగాలంగా కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగొలు కేంద్రాలకు తరలించి రెండు నెలలు గడిచినా కొనుగొలు చేయలేదు. ఈ క్రమంలో సోమవారం కురిసిన అకాల వర్షానికి తడిచి ముద్దయిన ధాన్యాన్ని చూసి తట్టుకోలేక తడిచిన బస్తాలతోపాటు కంప చెట్లు పెబ్బేరు- కొల్లాపూర్ రోడ్డుకు అడ్డంగా వేసి దాదాపు 100 మంది రైతులు రాస్తారోకోకు దిగిన ఘటన పెంట్లవెల్లి మండలం జటప్రోలులో మంగళవారం చోటు చేసుకున్నది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జటప్రోలులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి రెండు నెలల కిందట ధాన్యాన్ని తీసుకుచ్చినట్లు తెలిపారు. అయితే మ్యా చర్ వచ్చే వరకు ధాన్యాన్ని ఆరబెట్టాలని మహిళా సమాఖ్య సభ్యులు రైతులకు సూచించారు. రెండు నెలలు గడిచినా తమ ధాన్యాన్ని మ్యాచ్చర్ పేరుతో కొనుగోలు చేయకుండా ఐకేపీ అధికారులు రైస్‌మిల్లర్లతో చేతులు కలిపి ధాన్యానికి కాంటా వేయడం లేదని ఆరోపించారు.
ఈ కారణంగానే సోమవారం కురిసిన వర్షానికి ధాన్యం మొత్తం తడిచి ముద్దయ్యిందని ఇప్పుడెలా అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో రైతులకు పెద్దపీట వేశారని, కల్లాల్లోనే ధాన్యం కొనుగోలు చేసేవారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చినా అనేక కొర్రీలు పెట్టి ధాన్యం కొనుగోలు చేయకుండా నెలల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాసేలా చేస్తున్నారని, ధాన్యం అమ్మిన డబ్బులు కూడా సకాలంలో అందించడం లేదని మండిపడ్డారు. జిల్లాకు చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నారని, ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి మంత్రిగా ఉన్నా రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా తడిచిన ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైతుల ఇబ్బందులు తీర్చాలని డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకోతో గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రామన్‌గౌడ్, ఏపీఎం గౌస్ అక్కడికి చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి తడిచిన దాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు నచ్చచేపడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎస్కే ఖాజా, ఈశ్వర్‌రెడ్డి, శంకర్‌రెడ్డితోపాటు గ్రామానికి చెందిన రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.