మహ్మదాబాద్, ఆగస్టు 12 : ఉమ్మడి గండీడ్ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి అనేక మంది రైతులు రుణాలు పొందారు. ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన రూ.రెండు లక్షల రుణమాఫీలో రెండు విడుతల్లో రుణమాఫీ అయిన రైతుల నుంచి వడ్డీ పేరుతో వేలాది రూపాయలు కట్టించుకొని పేద రైతుల నడ్డి విరుస్తున్నారు. లోన్ స్టేట్మెంట్ ప్రకారం ఒక రైతు రుణమాఫీ అయిన తర్వాత రూ.1500 డివ్ చెల్లించాల్సి ఉండగా అతని దగ్గర నుంచి రూ.15 వేలు కట్టించున్నారు. అయితే రైతులు రుణమాఫీ వచ్చిందనే సంతోషంలో పీఏసీసీఎస్ సిబ్బంది అడిగినంత కట్టి వెళ్లిపోతున్నారు. అసలు రుణం తీసుకోని రైతులకు రుణమాఫీ అయ్యిందని మెసేజ్ రావడంతోపాటు మీరు ఇంత వడ్డీ చెల్లించి ఎన్వోసీ తీసుకోవాలని పీఏసీసీఎస్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు.
దీంతో సదరు రైతులు సోమవారం కార్యాలయానికి వచ్చి మేము రుణాలే తీసుకోలేదని, ఎందుకు వడ్డీ చెల్లించాలని సిబ్బందిని నిలదీశారు. తాము రుణాలు తీసుకోకున్నా ఫోర్జరీ సంతకాలు చేసి సిబ్బంది తమ పేర్లు మీద రుణాలు తీసుకొని డబ్బులు కాజేసి ఇప్పుడు రుణమాఫీ అయ్యింది, వడ్డీ చెల్లించాలని ఫోన్లు చేస్తున్నారని మండిపడుతున్నారు. సోమవారం కొంతమంది రైతులు లోన్ స్టేట్మెంట్ తీసుకొని మిగతా వడ్డీ చెల్లించడానికి వెళ్లగా తెలియని వారి దగ్గర రూ.వెయ్యి నుంచి రూ.20వేల వరకు తెలిసిన వారి నుంచి రూ.500నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేశారు.
ఇలా అదనంగా డబ్బులు తీసుకొని రశీదు ఇచ్చి కంప్యూటర్లో పొందుపర్చకపోవడంతో రైతుల్లో అనుమానం వచ్చి సిబ్బందిని నిలదీశారు. మేముకట్టిన ప్రతి రూపాయికి మీరు లెక్క చెప్పాల్సిందే.. మాతో కట్టించుకున్న డబ్బులు ఆన్లైన్లో పొందుపర్చి క్లియరెన్స్ ఇచ్చి పాసు పుస్తకాలు ఇవ్వాలని, కొత్త రుణాలు ఎప్పుడిస్తారో చెప్పాలని రైతులు సిబ్బందిని నిలదీశారు. అదేవిధంగా పీఏసీసీఎస్ సిబ్బంది చేస్తున్న మోసాలను సోమవారం గండీడ్‌కు వచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సైతం రైతులు వివరించారు. దీంతో ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పీఏసీసీఎస్‌లో రైతులకు అన్యాయం జరగనివ్వం. ప్రతి రైతుకు న్యాయం చేస్తాం, ఎవరూ ఆందోళన చెందవద్దు. డబ్బులు ఎందుకు ఎక్కువ వసూలు చేశారో తెలుసుకొని సదరు సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. రుణాలు క్లియర్ అయిన వారందరికీ పాసు పుస్తకాలు ఇప్పిస్తామని, కొత్త రుణాలు కూడా త్వరలో అందజేస్తాం.
– లక్ష్మీనారాయణ, పీఏసీసీఎస్ చైర్మన్