నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 13 : నాగర్‌కర్నూల్‌లో రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. రెండ్రోజులుగా తిరుగుతున్నా ఇప్పుడు.. అప్పుడంటూ టోకెన్లు ఇవ్వడం లేదని కన్నెర్ర చేశారు. శనివారం ఉదయం పీఏసీసీఎస్ వద్ద క్యూలో నిలబడినా కే వలం 20 టోకెన్లు మాత్రమే ఇవ్వడంతో కన్నెర్ర చేశారు. దీంతో సమీపంలోని ప్రధాన రహదారిపైకి దాదాపు వంద మంది రైతులు, మహిళలు చే రుకొని బైఠాయించారు. యూరియా ఇచ్చే వర కు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకూర్చున్నారు. ఎమ్మెల్యే ఇక్కడికి రావాలంటూ నినాదించారు. రెండ్రోజుల కిందట టోకెన్లు ఇచ్చినా.. యూరియా పంపిణీ చేయ డం లేదని మండిపడ్డారు. నిత్యం తిండితిప్పలు మానుకొని పడిగాపులు కాస్తున్నా బస్తా దొరకడం లేదని వాపోయారు. పలువురు జ్వరాల బారిన పడుతున్నా కష్టాలు మాత్రం తీరడం లేదన్నారు.
యూరియా సరిపడా ఉన్నదని అధికారులు చెబుతున్నా.. పంపిణీ చేయడం లేదన్నారు. కేవలం కొందరికే ఇస్తుండడంతో మిగతా వారు పనులు వదిలి.. క్యూలో నిలబడి.. చివరకు ఇంటికి ఒట్టిచేతులతో వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందారు. అరగంటపాటు నిర్వహించిన ఆందోళనతో ఇటు బస్టాండ్ వైపు.. అటు హౌసింగ్ బోర్డు వైపు వా హనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తె లుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పినా వినలేదు. సీఐ అశోక్‌రెడ్డితో పలువురు వాగ్వాదానికి దిగారు. కొన్ని చోట్ల రూ. 300లకు విక్రయిస్తున్నారని ఆగ్రహం చెందారు. చివరకు సీఐ, వ్యవసాయాధికారులతో మాట్లాడి యూరియా ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.