గద్వాల, ఆగస్టు 20 : ప్రస్తు తం వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులకు యూరియా తప్పనిసరి అయింది. అయితే రైతులకు సరిపడా యూరియా అధికారులు అందించకపోవడంతోపాటు గత మూ డు రోజులుగా అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్న అధికారుల తీరు ను నిరసిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని పీఏసీసీఎస్ కార్యాలయం ముందున్న ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. అదేవిధంగా రైతులకు సరిపడా యూరియా అందించడం లేదని కేటీదొడ్డి మండలం పాతపాలెం పీఏసీసీఎస్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు బాసు హనుమంతునాయుడు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రైతుల సంక్షేమం పై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లే దన్నారు. ఓ వైపు అధికారులు రైతులకు యూ రియా కొరత లేద ని చెబుతున్నారని అయితే యూరియా కొరత లేనప్పుడు రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని వ్యవసాయశాఖ అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిన్న గట్టు, ఇవాళ గద్వాలలో యూరియా కోసం రైతులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు రైతులు విత్తనాలు, ఎరువుల కోసం రోడ్డెక్కిన పరిస్థితి లేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు కష్టాలు తప్పడం లేదన్నారు. చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతుభరోసా పూర్తిస్థాయిలో ఇవ్వలేదని, ప్రస్తుతం యూరియా కష్టాలు రైతులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. యూరియాను అధికారులతోపాటు పాలకులు బ్లాక్ మా ర్కెట్ తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులకు అవసరమైన యూరియా అందించాలని లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రైతులు ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు.
రైతులు చేస్తు న్న ఆందోళన దగ్గరకు డీఎస్పీ మొగులయ్య చేరుకొని రైతులను శాంతింపజేశారు. ఏవో ప్రతాప్ రైతులకు నచ్చజెప్పారు. ప్రస్తుతం 250 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, అన్ని పీఏసీసీఎస్‌ల కు 150 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామ ని, దుకాణాలకు 100 మెట్రిక్ టన్నులు పంపామన్నారు. 437 మందికి టోకన్లు ఇచ్చి సరఫరా చేశామన్నారు. ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవద్దని, అవసరమైన యూరియా అందిస్తామన్నారు.
మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 20 : వాగు వరదకు వరి పంట కోతకు గురైన రైతు గొల్ల మోహన్‌ను ఆదుకుంటామని అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. అడ్డాకుల మండలంలోని రాచాల పెద్దవాగుపై నిర్మించిన చెక్‌డ్యాం నిర్మాణంలో భాగమైన సైడ్‌వాల్ కొట్టుకుపోయి
పొలం కోతకు గురైన విషయం ‘నమస్తే తెలంగాణ’ బుధవారం వెలుగులోకి తీసుకొచ్చిన విషయం విధితమే. అందుకు ఐబీ ఎస్ఈ వెంకటయ్య, తాసీల్దార్ శేఖర్‌తో పాటు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు నాగిరెడ్డి, రాచాల మాజీ సర్పంచ్ తిరుపతయ్య, గుడిబండ మాజీ ఎంపీటీసీ శకుంతల, సత్యనారాయణరెడ్డి కొతకు గురైన చెక్‌డ్యాం వద్ద వెళ్లారు. కోతకు గురైన వరి పంటను పరిశీలించి నీకు ఎలాంటి నష్టం జరగదని, ఎమ్మెల్యే అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారని రైతుకు భరోసా ఇచ్చారు.
గద్వాల రూరల్, ఆగస్టు 20 : యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో రైతులకు యూరి యా అత్యవసరమైనది. ప్రతి రోజు అధికారులు యూరి యా లేదని త్వరలో వస్తుందని చెప్తూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అయితే బుధవారం ఉదయం 9గంటల నుంచే పీఏసీసీఎస్ ముందు రైతులు బారులు తీరారు. ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. రైతు ల ఆందోళన విషయాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఉమ్మడి జిల్లా డైరెక్టర్ గద్వాల పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్‌ను పంపించి రైతులతో మాట్లాడి వారికి నచ్చజెప్పారు. అనంతరం ఎమ్మెల్యే సంబందిత అధికారులతో మాట్లాడి 20 టన్నుల యూరియా తెప్పించి రైతులకు సరఫరా చేయించారు.
అమరచింత, ఆగస్టు 20 : గత రెండు వారాల నుంచి రైతులు యూరియా కోసం తిరుగుతున్నా సక్రమంగా అందడం లేదు. రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాస్తున్నా యూరియా కొరత తీరకపోవడంతో అలసిపోయిన రైతులు తమకు బదులుగా క్యూలైన్లో చెప్పులు, ఇటుకలను పెట్టి పడిగాపులు కాస్తున్నారు. బుధవారం సాయత్రం నాలుగు గంటలకు యూరియా లోడ్ రావడంతో ఒక్కసారిగా యూరియా కోసం రైతులు ఎగబడ్డారు.
గట్టు, ఆగస్టు 20 : యూరియా కోసం రైతులకు ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. వారం రోజుల తర్వాత పీఏసీసీఎస్‌లో 750 బస్తాల యూరియాను మంగళవారం పంపిణీ చేయడంతో రైతులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇక్కట్లు పడుతూ యూరియాను తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం కూడా రైతులు పీఏసీసీఎస్కు చేరుకొని యూరియా సరఫరా అవుతుందేమోనని వేచిచూశారు. నిన్నటి మాదిరిగానే పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డుల జిరాక్స్ ప్రతులను వరుస క్రమంలో ఉంచారు. అయితే యూరియా రావడానికి ఇంకా ఒకటి, రెండు రోజులు పడుతుందని అధికారులు తేల్చిచెప్పడంతో చేసేదిలేక రైతులు తమ తమ గ్రామాలకు వెళ్లిపోయారు. కాగా బుధవారం గట్టు, గొర్లఖాన్‌దొడ్డిలోని అగ్రోస్ కేంద్రాల్లో 600 బస్తాల యూరియా పంపిణీని చేశారు.
రైతులకు గత కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే.. పదేండ్ల కాలంలో ఏనాడు యూరియా, ఇతర ఎరువుల కోసం రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓటు వేసినందుకు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు అవసరమైన ఎరువులు అందించాలి.
– వెంకటస్వామి, రైతు, లత్తీపురం