 
                                                            నాగర్కర్నూల్, అక్టోబర్ 30 : కొర్రీలు పెట్టి పత్తిని కొనుగోలు చేయకపోవడంతో నాగర్కర్నూల్ మండలం గగ్గలపల్లి శివారులోని కాటన్ మిల్లు ఎదుట రైతులు గురువారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. సీసీఐ అధికారులు పత్తి తడిగా ఉందని, బాగాలేదనే కారణాలు చూపి కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కళ్ల ముందే దళారులు తెచ్చిన పత్తిని కొనుగోలు చేస్తూ రైతులు తెచ్చిన పత్తికి కొర్రీలు పెట్టడంతో మండిపడ్డారు.
రోడ్డుపై భైఠాయించి ధర్నా చేయడంతో ఇటు మంత టి చౌరస్తా, అటు గగ్గలపల్లి వరకు భారీ మొత్తంలో వాహనాలు నిలిచిపోయాయి. సమయానికి కొనుగోలు చేయకపోవడంతో అద్దె వాహనాలకు రెండు మూడు రోజులపాటు కిరాయి చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కిలోమీటర్ల పొడవునా వందలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొద్దస్తమానం ఎ దురు చూసి విరక్తి చెందిన రైతులు సా యంత్రం ఒక్కసారిగా రోడ్డెక్కారు. ఈసారి అధికంగా కురిసిన వర్షాలకు చాలా వరకు పంట నష్టపోయామని, చేతికి వచ్చిన కొంత పంటను సైతం బాగాలేదన్న సాకు చూపి కొనకపోవడంతో రైతులు మండిపడ్డారు.
జిల్లాలోని తాడూరు, తెలకపల్లి, పెద్దకొత్తపల్లి, అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాల నుంచి అద్దె వాహనాల్లో పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే అధికారులు ఖరీదు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన విరమించబోమని పట్టుబట్టారు. రైతులకు నచ్చే చెప్పే ప్రయత్నించిన మిల్లు నిర్వాహకులతో రైతులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు.
 
                            