కోస్గి, మే 10 : ఆరుగాలం కష్టపడి పంట పండిస్త్తే ధాన్యాన్ని ఇంకెప్పుడు కొం టారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరురోజులుగా పొలాల వద్దే ధాన్యం నిల్వ ఉంచినా అధికారులు మాత్రం రేపు మాపు అంటూ మాట దాట వే స్తున్నారంటూ ఆందోళన చెందుతున్నారు. కోస్గి మండలంలోని బొలోన్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడంతో పక్క గ్రామం ముశ్రీఫాలో ఉన్న కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తరలిస్తున్నారు. అయితే అక్కడికి ధాన్యాన్ని తరలించడానికి రైతులకు ప్రయాణం భారంతో గ్రామ రైతులంతా కలిసి తమ గ్రామంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధికారులను కోరారు.
రైతుల కోరిక మేరకు అధికారులు గ్రామంలోనే ధాన్యం కొ నుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ధాన్యాన్ని పొలాల వద్ద బస్తాల్లో నింపి సిద్ధంగా ఉంచారు. ఆరు రోజులు గడిచినా అధికారులు ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. గ్రామానికి ధాన్యం కొనుగోలు కోసం వస్తామన్న అధికారులు రావడం లేదని, కనీసం ఎప్పుడొస్తారో కూడా సమాధానం ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కల్లాల్లోనే నిల్వ ఉంచుతామని ఒకవేళ వర్షం వస్తే తమ ధాన్యం పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. సీఎం ఇలాకాలో రైతుల ఈ దుస్థితిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈవిషయంపై ఏవో రామకృష్ణను వివరణ కోరగా రైతుల వినతి మేరకు గ్రామంలోనే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పామన్నారు. సోమవారం నుంచే గ్రామానికి వెళ్లి రైతుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు.
బిజినేపల్లి, మే 10 : ఆరుగాలం కష్టించిన కోతకోసిన మొక్కజొన్న పంట కల్లాల్లో ఆరబెట్టి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం మక్కలను కొనుగోలు చేయడం లేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మండలానికి కేవలం ఒకే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కంటే ఈఏడాది ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగు చేశారు. దానికి తగినట్లుగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కొనుగోలు ముందుకు వెళ్లకపోవడం వల్ల రైతులు గన్నీ బ్యాగుల నుంచి కొ నుగోలు చేసే వరకు నానా అవస్థలు పడాల్సిన దుస్థి తి ఏర్పడుతుంది. మూడు వారాలుగా రాత్రి పగలు కల్లాల్లో మొక్కజొన్న ధాన్యానికి కాపలా కాయాల్సి వస్తుంది. దీనికితోడు గాలివాన అకస్మాత్తుగా వస్తే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం స్పందించి రైతు పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు.