అయిజ, జూన్ 13 : పెద్ద ధన్వాడలో రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయడంతోపాటు రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను బేషరతుగా సర్కారు ఉసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సును శుక్రవారం పెద్దధన్వాడ గ్రామస్తులు, రైతులు బహిష్కరించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమపై ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం భౌన్సర్లు, పోలీసులతో రెచ్చగొట్టే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని అధికారులు, పాలకులు, మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా రైతులపై అకారణం గా కేసులు పెట్టి జైళ్లకు పంపడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే వానకాలం పంటల సాగు చేసుకునే సమయంలో కో ర్టులు, జైళ్లు, పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బంగారు పంటలు పండే సారవంతమైన భూములు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో కలుషిత కారకాలతో నిండిపోయే ప్రమాదం ఉండడంతోనే ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గత 8 నెలలుగా 12గ్రామాల కు చెందిన రైతులు, గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడుతున్నారు. ఈ నెల 4న జరిగిన సంఘటనలో 40 మం దిపై పోలీసులు కేసులు నమోదు చేసి, 12 మందిని జైలుకు పంపారని తెలిపారు. ప్ర భుత్వం వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు పూర్తిగా చేసి, 40 మందిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసే వరకు తమ పోటరాం ఆపేదిలేదన్నారు.
రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడలో శుక్రవారం తాసీల్దార్ రామ్మోహన్ ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సును రైతు వేదికలో ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 గంటలకు అధికారులు రైతు వేదికకు చేరుకున్నప్పటికీ రైతులు ఎవరు చేరుకోలేదు. గురువారం గ్రామస్తులు ముక్తకంఠంతో రెవెన్యూ సదస్సును బహిష్కరించాలని తీర్మానం చేసుకోవడంతో కొద్ది మంది రైతులు రైతు వేదికకు చేరుకొని భూభారతి రెవెన్యూ సదస్సును బహిష్కరిస్తున్నట్లు తాసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు, రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేస్తామని సర్కారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే వరకు భూభారతి సదస్సులు నిర్వహించవద్దని అధికారులకు సూచించారు.